వేకువనే విషాదం | Sakshi
Sakshi News home page

వేకువనే విషాదం

Published Mon, Jul 29 2019 12:42 PM

Four People Died In Guntur Road Accident - Sakshi

సాక్షి, మద్దిపాడు (గుంటూరు) : తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుని కొద్ది గంటలలో ఇంటికి చేరుతామనగా ఆ కుటుంబాన్ని మృత్యువు కాటు వేసింది. చీకటిలో ఎవరికి దెబ్బలు తగిలాయో తెలియక, భయానకంగా ఉన్న ప్రాంతంలో తల్లి కూతుళ్లు తల్లడిల్లిపోయారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మేడూరు గ్రామానికి చెందిన విస్సంశెట్టి పాండురంగారావు (42) భార్య అనురాధ, కుమార్తె భాను సుప్రియ, కుమారుడు శ్యాం సత్య సాగర్‌ (10), తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలో నివసిస్తున్న బావమరిది సేగు నరసింహారావు (40)తో కలసి దేవరపల్లికి చెందిన కారు డ్రైవర్‌ కం ఓనర్‌ జొన్నల సాంబిరెడ్డి(44) తో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లి శనివారం దర్శనం తరువాత రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 నిమిషాల సమయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి ఫ్‌లైఓవర్‌పై ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్‌ జొన్నల సాంబిరెడ్డి, పాండురంగారావు, అతని కుమారుడు శ్యాంసత్యసాగర్, బావమరిది సేగు నరసింహారావు అక్కడికక్కడే మరణించారు.

ఈ సమాచారం అందుకున్న మద్దిపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన పాండురంగారావు భార్య అనూరాధ, కుమర్తె భానుసుప్రియలను 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. తెల్లవారుజాము కావడంతో చీకటిగా ఉండడంతో హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది, ఎన్‌హెచ్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది వాహనాలను సర్వీసు రోడ్డులోకి మరల్చి మరో ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం సుమారుగా 6 గంటల సమయంలో స్థానిక ఎస్‌ఐ ఖాదర్‌బాషా సీఐ సుబ్బారావులు ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్‌ కింద ఇరుక్కుపోయిన కారును ఎస్కలేటర్‌ ద్వారా  బయటకు తీయించారు. అనంతరం డోర్లు తీయడానికి మద్దిపాడు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. వీలు పడకపోవడంతో ఒంగోలు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్‌ చేయడంతో అగ్నిమాపక అధికారి వై.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది అధునాతనమైన పరికరాలతో డోర్లు కత్తిరించి మృతదేహాలను వెలికి తీశారు.

ఎస్‌ఐ సీఐలు తమ సిబ్బంది సాయంతో మృతదేహాలను బయటకు తీసి అంబులెన్స్‌ ద్వారా ఒంగోలు రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పాండురంగారావు కిరాణా దుకాణం నడుపుకుంటుండగా, అతని కుమారుడు కుమారుడు 5వ తరగతి, కుమార్తె ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ప్రమాదం కారణంగా మూడు కుటుంబాలలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఒంగోలు డీఎస్‌పీ కేవీవీఎన్‌ ప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మద్దిపాడు ఎస్‌ఐ కేసు నమోదు చేయగా సీఐ సుబ్బారావు దర్యాప్తు చేస్తున్నారు. 

దేవరపల్లి, మేడూరులో విషాదఛాయలు  
తోట్లవల్లూరు/పమిడిముక్కల(పామర్రు):ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై దేవరపల్లి, మేడూరు గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ప్రమాద సమాచారం తెలియగానే దేవరపల్లిలో కలకలం రేగింది. అందరితో కలిసిమెలిసి ఉండే నరసింహారావు, గత 22 ఏళ్ల నుంచి కార్లు నడుపుతున్న జొన్నల సాంబిరెడ్డి మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మృతుల నివాసాల వద్ద విషణ్ణ వాతావరణం నెలకొంది.  ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడం, మరొక ఇద్దరికి తీవ్ర గాయాలవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Advertisement
Advertisement