పెట్రోల్‌ ధరలు : నీతి ఆయోగ్‌ నిర్లక్ష్య వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ధరలు : నీతి ఆయోగ్‌ నిర్లక్ష్య వ్యాఖ్యలు

Published Wed, Sep 5 2018 5:15 PM

‘Govt Need Not Respond To Daily, Weekly Changes In Oil Prices’ - Sakshi

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నాయి. గ్లోబల్‌గా క్రూడాయిల్ ధరలు పెరగడంతో, పెట్రో మంట వినియోగదారులకు వాత పెడుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ సెగ ఇప్పుడు అన్ని వాటిపై చూపుతుంది. స్కూల్‌ వ్యాన్‌ ఫీజులు పెరిగిపోయాయి. అటు స్టాక్‌ మార్కెట్లకు దీని సెగ తగిలి, కుప్పకూలుతున్నాయి. రూపాయి అయితే ఏకంగా పాతాళంలోకి పడిపోయింది. అయితే ఇంత మేర ప్రభావం చూపుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నీతి ఆయోగ్‌ వైస్‌-చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు. రోజూ, వారం మారే ఆయిల్‌ ధరలపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. గ్లోబల్‌ ఆయిల్‌ ధరలు రోజువారీగా, వారంవారీగా, పిరియాడిక్‌గా మారుతూనే ఉంటాయని, కమోడిటీ ధరలను గమనించాలని, కానీ వీటిపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదని అన్నారు. ‘జూన్‌లో ధరలు పెరిగాయి. జూలైలో తగ్గిపోయాయి. అవునా కాదా? ఇదే పరిస్థితి మరోసారి జరుగుతుంది’ అంటూ కుమార్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో, దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్కై రాకెట్‌లా పెరిగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం, ఎన్‌డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పన్నులు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కానీ పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.79.31గా రికార్డు స్థాయిలో నమోదైంది. డీజిల్‌ కూడా ఆల్‌-టైమ్‌ గరిష్టంలో రూ.71.34గా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులకు వాత పెడుతున్న, ప్రభుత్వం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదనడం గమనార్హం. 
 

Advertisement
Advertisement