చివర్లో అమ్మకాలతో నష్టాలు

Losses with sales at the end - Sakshi
షార్ట్‌ కవరింగ్‌తో బ్యాంక్‌ షేర్ల రికవరీ ఐటీ షేర్ల లాభాలతో తగ్గిన నష్టాలు 71 పాయింట్ల పతనంతో 33,704కు సెన్సెక్స్‌ 18 పాయింట్ల నష్టంతో 10,360కు నిఫ్టీ

చివరి గంటలో వెల్లువెత్తిన అమ్మకాల కారణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. స్టాక్‌సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ పతనమయ్యాయి. సెన్సెక్స్‌  71 పాయింట్లు నష్టపోయి 33,704 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 10,360 పాయింట్ల వద్ద ముగిశాయి.    

లోహ షేర్లకు లాభాలు..
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం 58 పైసలు నష్టపోయి మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం,  విదేశీ ఇన్వెస్టర్లు  అమ్మకాలు కొనసాగిస్తుండటం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రకంపనలు ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే ఐటీ కంపెనీలకు మంచి వ్యాపార అవకాశాలు వచ్చే విధంగా పరిస్థితులు కుదుటపడుతున్నాయని నాస్కామ్‌ వెల్లడించడం, డాలర్‌ పుంజుకోవడంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి.

లోహ షేర్లు కూడా లాభపడటంతో నష్టాలు పరిమితమయ్యాయి.  పీఎన్‌బీ కుంభకోణం నేపథ్యంలో గత నాలుగు రోజులుగా పతనమవుతున్న ప్రభుత్వ రంగ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ జరగడం వల్ల కూడా నష్టాలు కొంత తగ్గాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 186 పాయింట్లు లాభపడగా, మరో దశలో 117 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 303 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 598 పాయింట్లు పతనమైంది.

ఒడిదుడుకులుంటాయ్‌..: షార్ట్‌ కవరింగ్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్‌లో ఆరంభంలో లాభపడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. బాండ్ల రాబడులు పెరుగుతుండటంతో ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లపై అమ్మకాల ఒత్తిడి అధికమైందని, దీంతో లాభాలు కొనసాగలేదని వివరించారు. మరో 2 రోజుల్లో ఫిబ్రవరి సిరీస్‌ ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో ఒడిదుడుకులు తప్పవని, మార్కెట్‌కు ఇన్వెస్టర్లు దూరంగా ఉండటమే మంచిదని సూచించారు.

ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు–యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్,   ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.4% వరకూ నష్టపోయాయి. బొగ్గు గనుల వేలానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో కోల్‌ ఇండియా 1.6% లాభంతో రూ.310 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో 28%కి పైగా నష్టపోయిన పీఎన్‌బీ షేర్‌ కోలుకుంది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి రూ.111కు పడిపోయిన ఈ షేర్‌ చివరకు స్వల్ప లాభంతో రూ.116 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top