కలెక్టర్‌గా ఆరోఖ్యరాజ్ బాధ్యతల స్వీకరణ | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా ఆరోఖ్యరాజ్ బాధ్యతల స్వీకరణ

Published Thu, Sep 5 2013 3:42 AM

Arokhyaraj collector acceptance of responsibility

విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కొత్త కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. కలెక్టర్‌గా ఆయన బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జేసీ ప్రవీణ్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన వి.శేషాద్రి పీఎంఓ కార్యాలయంలో డెరైక్టర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో చిత్తూరు కలెక్టర్‌గా ఉన్న ఆరోఖ్యరాజ్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

దీంతో ఆరోఖ్యరాజ్ బుధవారం ఉదయం 8.30 గంటలకు ఇండిగో విమానంలో చెన్నై నుంచి విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో జిల్లా పరిషత్ సీఈఓ డి.వెంకటరెడ్డి, ఆర్డీఓ రంగయ్య, అర్బన్ తహశీల్దార్ టి.వేణుగోపాల్‌లు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా బంగ్లాకు వెళ్లారు. ఉదయం 11.16 గంటలకు కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ భూముల వ్యవహారంపై తనకు అవగాహన ఉందని, రంగారెడ్డి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో భూ వ్యవహారాలపై దృష్టి సారించానన్నారు. జిల్లాలో కూడా భూముల వ్యవహారంపై ఉన్న పరిస్థితులను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 అధికారులతో పరిచయ కార్యక్రమాల అనంతరం ఉదయం హెచ్‌పీసీఎల్ అతిథి గృహంలో మంత్రి గంటా శ్రీనివాసరావును ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తిరిగి కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులతో కాసేపు ముచ్చటించారు. జిల్లా పరిస్థితులను కలెక్టర్‌కు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వివరించారు. మంత్రి పి.బాలరాజును కలెక్టర్ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.
 

Advertisement
Advertisement