రాయితో దాడి | Sakshi
Sakshi News home page

రాయితో దాడి

Published Wed, May 8 2024 4:15 AM

రాయిత

– వ్యక్తికి గాయాలు

మదనపల్లె : రాయితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం పట్టణంలో జరిగింది. మండలంలోని పూతబో లు పంచాయతీ దిగువ గాండ్లపల్లి కు చెందిన జి సుధాకర్‌ (50) వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వచ్చి తిరిగి వెళుతుండగా, సీటీఎం రోడ్డులోని రెడ్డప్ప నాయుడు కాలనీ వద్ద, అదే గ్రామానికి చెందిన వెంకటరమణ రాయితో దాడి చేయడంతో, రైతుసుధాకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుని ఆటోలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

కుక్కల దాడిలో

15 గొర్రెలు మృతి

సంబేపల్లె : మండలంలోని ఎస్‌.సోమవరం గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు.. ఎస్‌.సోమవరం పంచాయతీకి చెందిన గుది సుధాకర్‌ గొర్రెలను పొలం వద్ద వదలగా, మంగళవారం కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 15 గొర్రెలు మృతి చెందగా, మరో 14 గొర్రెలు గాయపడ్డాయి. గాయపడిన వాటికి వెటర్నరీ సిబ్బంది చికిత్స నిర్వహించారు.

గొంతులో పొడుచుకుని

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం తంబళ్లపల్లెలో జరిగింది. స్థానికంగా నివాసం ఉన్న చిట్టెం వెంకటరమణ కుమారుడు బాలసుబ్రమణ్యం (45), రాజస్థాన్‌ రాష్ట్రంలో ప్రైవేట్‌ సెక్టార్‌ లో సివిల్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఇంటి వద్ద కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపం చెంది, కత్తితో గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌ వాహనంలో మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితుడు కోలుకుంటున్నాడు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి తీవ్ర గాయాలు

లక్కిరెడ్డిపల్లె : మండలంలోని మర్రిచెట్టు – కుర్నూతల రోడ్డు మార్గంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలుకాగా ఒకరి పరిస్థితి విషమించడంతో 108 ద్వారా కడప రిమ్స్‌కు తరలించినట్లు లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మండలంలోని మద్దిరేవుల గ్రామం ఈడిగపల్లెకు చెందిన తుమ్మల వెంకటరమణ, సంబేపల్లె మండలం ఎర్రగుంట్ల గ్రామం మద్దులోల్లపల్లెకు చెందిన మండెం శ్రీనివాసులు మద్దిరేవుల గ్రామం జీఆర్‌ కాలనీలోని తన అత్తారింటికి వచ్చారు. వీరు ద్విచక్ర వాహనంలో లక్కిరెడ్డిపల్లెకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయాలపాలైన వారిని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌ తరలించారు.

దాడి చేసిన వ్యక్తులపై

కేసు నమోదు

నిమ్మనపల్లె : బాకీ విషయమై వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి తెలిపారు. కొండయ్య గారి పల్లె పంచాయతీ వెంకోజి గారి పల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు రవికుమార్‌ (35), రెడ్డి వారి పల్లి పంచాయతీ చలిమామిడి హరిజనవాడకు చెందిన రామచంద్ర వద్ద పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. వారానికి వెయ్యి రూపాయల చొప్పున తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా రవికుమార్‌ ఐదు వారాలు అప్పు చెల్లించాడు. అయితే సోమవారం నిమ్మనపల్లి నుంచి మదనపల్లి కు ఆటోలో వెళ్తున్న రవికుమార్‌ ను కొండయ్య గారి పల్లె కోళ్ల ఫారం వద్ద రామచంద్ర అతని కుమారుడు గౌతమ్‌ బంధువు చంద్ర ముగ్గురు కలిసి అడ్డగించి ఆటోలో నుంచి దింపి వేశారు. మిగిలిన బాకీ మొత్తం ఇప్పుడే చెల్లించాలంటూ గొడవకు దిగారు. అంతేకాకుండా రాడ్డుతో రవికుమార్‌పై దాడి చేశారు. దాడిలో రవికుమార్‌ తలకు తీవ్ర గాయమై మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిపై హెడ్‌ కానిస్టేబుల్‌ శివరామకృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

రాయితో దాడి
1/3

రాయితో దాడి

రాయితో దాడి
2/3

రాయితో దాడి

రాయితో దాడి
3/3

రాయితో దాడి

Advertisement
Advertisement