No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

ఒంటిమిట్ట: లోక కళ్యాణార్థం జగమేలే వైకుంఠరాముని జగత్‌ కళ్యాణం ఆంధ్రభద్రాద్రి ఏకశిలానగరి ఒంటిమిట్టలోని జగదభిరాముడి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయమాడిన వేళ శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని మూల మూర్తులకు రాష్ట్ర స్పెషల్‌ సీఎస్‌ కరికలవల్లన్‌ కల్యాణ వేదిక వద్ద ఉన్న కల్యాణ దంపతులైన సీతారాములకు ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలు సంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పించారు.

సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచ్రందులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు తీర్చి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య భక్తుల జయజయ ధ్వనాలతో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్షేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానకీ ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేద పండితులు స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో పెట్టి కన్యావరణ జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోప వీత ధారణం చేశారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి, వర పూజ చేశారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా నును సిగ్గుల మొలకై న సీతమ్మ నోసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్‌ సీఎస్‌ కరికాలవలవన్‌ సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నాడు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కణ్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళకాష్టం చదివారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పఠనం భక్తుల రామనామ ధ్వనుల మధ్య హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతి దేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానించి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపినీ సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రాధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సుపై వేసి కనుల పండువగా కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది.

● స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌తోపాటు టీటీడీ యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్త జనం వీక్షించారు.

భక్తుల రామనామ సంకీర్తనలు.. పండితుల చతుర్వేద పఠనం..మంగళవాయిద్యాల నడుమ.. సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీ రామచంద్రమూర్తి , జనకుని గారాల పట్టి.. నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడాడు. కమనీయం..రమణీయమైన ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తడిసిముద్దయ్యారు.

కమనీయం..దాశరథి కల్యాణం

ఏకశిలానగరిలో పండు వెన్నెలలో రాములోరి కల్యాణం

కనులారా వీక్షించిన చంద్రుడు

పోటెత్తిన భక్తజనం

మార్మోగిన రామనామం

Advertisement

తప్పక చదవండి

Advertisement