Sakshi News home page

సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం

Published Fri, Mar 29 2024 1:10 AM

- - Sakshi

ఏలూరు టౌన్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ డీ.మేరీ ప్రశాంతి చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం, తెలంగాణ జిల్లా ఖమ్మం కమిషనరేట్‌ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు జిల్లాల్లోని బోర్డర్‌ పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి, నాటు సారా, మద్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు వద్ద నిత్యం వాహన తనిఖీలు చేపట్టేలా సిబ్బందిని నియమించామన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సమాచార మార్పిడితోపాటు, సంయుక్తంగా దాడులు చేయటం, నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కోడ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర, పోలవరం డీఎస్పీ ఆర్‌.సతీష్‌కుమార్‌ రెడ్డి, నూజివీడు డీఎస్పీ జీ.లక్ష్మయ్య, సత్తుపల్లి ఏసీపీ ఏ.రఘు, జంగారెడ్డిగూడెం సీఐ రాజేష్‌, నూజివీడు రూరల్‌ సీఐ రామకృష్ణ, సత్తుపల్లి, అశ్వారావుపేట సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.

ఎన్నికల కౌంటింగ్‌,

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

ఏలూరు టౌన్‌: ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ సెంటర్లు, స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాటుపై గురువారం సాయంత్రం ఏలూరు జిల్లా ఎస్పీ డీ.మేరీ ప్రశాంతి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కించేందుకు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాట్లపై పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇంజనీరింగ్‌ కాలేజీలో మౌలిక సదుపాయాలు, భద్రతా పరమైన అంశాలు ఏవిధంగా ఉన్నాయో తనిఖీ చేస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌లలో పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను భద్రం చేయటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కౌంటింగ్‌ సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, అధికారుల వాహనాల పార్కింగ్‌, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో పరిశీలన చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, ఏలూరు త్రీటౌన్‌ సీఐ వి.వెంకటేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసరావు, ఏలూరు వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణబాబు, పోలీస్‌ అధికారులు ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement