Sakshi News home page

రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమ పోస్టింగులు!

Published Wed, Mar 27 2024 1:05 AM

వరంగల్‌ ఆర్వో కార్యాలయం    - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖను ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రెండేళ్ల కిందట జరిగిన జోనల్‌ బదిలీలు, పోస్టింగ్‌ల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమాలు జరిగినట్లు అందిన ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం వీటిపైన విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌లో 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో వివిధ కేడర్లలో జరిగిన నియామకాలపైనా విచారణ జరుగుతోంది. రెండేళ్ల క్రితం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జోనల్‌ వ్యవస్థను ఉల్లంఘిస్తూ చేపట్టిన బదిలీలపై మార్పు చేర్పులు తప్పవని అధికారులు చర్చించుకుంటున్నారు. గ్రేడ్‌–1 స్ధాయిలో గ్రేడ్‌–2 అధికారులను నియమించడంపై గతంలోనే రచ్చ జరిగింది. తాజాగా ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ప్రక్షాళనకు సిద్ధం కాగా.. అక్రమ బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారం ఆశాఖలోని అధికారుల్లో చర్చనీయాంశం అవుతోంది.

గ్రేడ్‌–1 స్థాయిలో.. గ్రేడ్‌–2 అధికారులు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా వరంగల్‌ ఆర్వో, జనగామ, మహబూబాబాద్‌, డీఐజీ కార్యాలయంలో గ్రేడ్‌–1 స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తారు. రెండేళ్ల క్రితం నాటి ప్రభుత్వం చేపట్టిన మల్టీజోన్‌, జోనల్‌ బదిలీల్లో జనగామ, మహబూబాబాద్‌కు గ్రేడ్‌–1స్థాయి అధికారులు, వరంగల్‌ ఆర్వోకు గ్రేడ్‌ –2 స్థాయి అధికారులు వచ్చారు. వరంగల్‌ ఆర్వో కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్‌ పర్యవేక్షణలో ఒక గ్రేడ్‌–1, ఒక గ్రేడ్‌–2స్థాయి సబ్‌ రిజిస్ట్రార్లు విధులు నిర్వహించాల్సి ఉండగా ఇద్దరూ గ్రేడ్‌–2 స్థాయి వారినే కొనసాగించడం బదిలీల్లో జోనల్‌ ఉల్లంఘన కనిపిస్తోందని ఆశాఖకు చెందిన వారే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్‌లో ఎక్కడ ఈ పరిస్థితి ఉందన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వాస్తవానికి ఉండాల్సిన సిబ్బంది ఎంత? ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? రెండేళ్ల కిందట జరిగిన జోనల్‌ బదిలీల్లో ఇంకా ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరి గాయి? అన్న కోణంలో ఇంటెలిజెన్స్‌ ఆరా తీస్తుండటంపై ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

జోనల్‌ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు

ఉమ్మడి వరంగల్‌లో పలుచోట్ల

జరిగినట్లు ఆరోపణలు

గత ప్రభుత్వ హయాంలో బదిలీలు,

పోస్టింగ్‌లపై ఆరా

త్వరలోనే రిజిస్ట్రేషన్ల శాఖలో తిరిగి

ట్రాన్స్‌ఫర్లు?

Advertisement

What’s your opinion

Advertisement