- దసరాకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం 7 వేల ప్రత్యేక బస్సులు: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
- జూబ్లీ బస్ స్టేషన్ (JBS) లో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలన
- ఇప్పటివరకు 95 శాతం ప్రత్యేక బస్సులను విజయవంతంగా నడిపిన టీజీఎస్ ఆర్టీసీ
- అక్టోబర్ 17, 18,19 తేదీల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు ఆదేశాలు
- పండుగ తర్వాత తిరుగు ప్రయాణానికి కూడా భారీగా ప్రత్యేక సర్వీసులు సిద్ధం : నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: దసరాను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం TGSRTC 7వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం బస్సులను విజయవంతంగా నడిపినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని వెల్లడించారు.
శుక్రవారం హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (JBS) ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సిహెచ్. వెంకన్న, ఏ. శ్రీధర్లతో కలిసి ఎండీ నాగిరెడ్డి గంటకు పైగా బస్ స్టేషన్లో పర్యటించారు. ప్రయాణికులతో నేరుగా ముచ్చటించి, వారికి కల్పిస్తున్న ఏర్పాట్లు, సౌకర్యాలు, మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్లో ప్రయాణికుల కోసం చేసిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.. "ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను నడపాలి. దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. పండుగ ముగిసిన అనంతరం తిరిగి నగరాలకు చేరుకునే ప్రయాణికుల కోసం కూడా ఇదే తరహాలో ప్రత్యేక బస్సు సర్వీసులను సిద్ధం చేయాలి" అని ఆదేశించారు.
బస్ స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుద్ధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ ముందస్తు రిజర్వేషన్లను అధికారిక వెబ్సైట్ www.tgsrtcbus.in ద్వారా బుక్ చేసుకోవాలని కోరారు.
ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులందరూ టీజీఎస్ఆర్టీసీ సేవలనే వినియోగించుకుని సురక్షితంగా, ప్రశాంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులకు వై.నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మల్కాపురం ఇండస్ట్రీలో పేలుడు


