ప్రజారోగ్యంలో మనది మూడో స్థానం  | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంలో మనది మూడో స్థానం 

Published Mon, Feb 14 2022 4:43 AM

Telangana Government Using Teach Effectively In Health Services: Harish Rao - Sakshi

సాక్షి, కామారెడ్డి: ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యల వల్ల దేశంలో మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందని, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ 33వ స్థానంలో ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆశ కార్యకర్తలకు మనం రూ.9,750 జీతం ఇస్తుంటే ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రూ. 4 వేలే ఇస్తున్నారన్నారు. వివిధ రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన మనం.. ప్రజా వైద్య రంగంలోనూ త్వరలో తొలి స్థానంలో నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని 27 వేల మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కామారెడ్డిలో మంత్రి ప్రారంభించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని, నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిని పరిశీలించి కలెక్టరేట్‌లో వైద్యులు, ఆశ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆశ కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు అందిస్తున్నామన్నారు. 

పనితీరుపై ఆరా తీస్తా.. 
బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మందులన్నీ ఇంటికి అందించేందుకు ఎన్‌సీడీ కిట్‌లను త్వరలోనే అందించనున్నట్లు మంత్రి చెప్పారు. తమది ఉద్యోగుల మేలు కోరే ప్రభుత్వమని, గాంధారిలో గుండెపోటుతో చనిపోయిన వైద్యుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఏఎన్‌ఎం ప్రమాదంలో చనిపోతే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామన్నారు. పనిచేస్తే కడుపులో పెట్టుకుంటామని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవడం తమ విధానమని స్పష్టం చేశారు. వైద్యులకు పీజీ కోసం 30 శాతం రిజర్వేషన్‌ కల్పించామని, వైద్యులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

వైద్యులకు ఫోన్‌ చేసి ఆశ వర్కర్లు ఎలా పని చేస్తున్నారో ఆరా తీస్తానని, డాక్టర్ల గురించి ఆశ వర్కర్లతో మాట్లాడి తెలుసుకుంటానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, వైద్యుల పనితీరును తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఏఎన్‌ఎంలకు త్వరలో ఐ ప్యాడ్‌లు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్‌ షిండే, పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement