మూగజీవాలకూ రక్షణ ఇద్దాం! | Scientists suggestions for protecting cows buffaloes and chickens from sun heat | Sakshi
Sakshi News home page

మూగజీవాలకూ రక్షణ ఇద్దాం!

Apr 9 2025 4:18 AM | Updated on Apr 9 2025 4:18 AM

Scientists suggestions for protecting cows buffaloes and chickens from sun heat

మండే ఎండల నుంచి ఆవులు, గేదెలు, కోళ్ల పరిరక్షణకు శాస్త్రవేత్తల సూచనలు

(సాక్షి స్పెషల్‌ డెస్క్‌) : చిన్న, సన్నకారు రైతులు పశుపోషణ ద్వారా సమకూరే ఆదా యంపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే, ఈ ఏడాది మార్చి నుంచే సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. దీంతో పాడి ఆవులు, గేదెలు, గొర్రె లు, మేకలు, కోళ్ల సంరక్షణ రైతులకు కత్తి మీద సాము లా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ జిల్లా మామునూరులోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అనుబంధ ఐసీఏఆర్‌ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత డాక్టర్‌ ఎన్‌. రాజన్న, శాస్త్రవేత (ఎల్‌పీఎం) డాక్టర్‌ సాయి కిరణ్, ‘ఐసీఏఆర్‌–అటారి’ (జోన్‌–10) డైరెక్టర్‌ డాక్ట ర్‌ షేక్‌.ఎన్‌.మీరా రైతులకు సూచనలు ఇస్తున్నారు. 

ఈ వేసవి మనుషులతోపాటు పశువులకూ గడ్డు కాలమే. తెలంగాణలో సుమారు 3.26 కోట్ల పశు వులు ఉన్నాయి. ఇందులో 42.3 లక్షల ఆవులు 42.26 లక్షల గేదెలు, 1.90 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు 1.78 లక్షల పందులతోపాటు 7.99 కోట్ల కోళ్లు ఉన్నాయి. రైతులు తగు జాగ్రత్తలు తీసు కుంటే వేసవిలో పాలు, మాంసం ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవొచ్చు. విదేశీ జాతి, సంకర జాతి ఆవులు 24–27 డిగ్రీల సెల్సియస్‌ (డి.సె.), దేశీ ఆవులు 33 డి.సె.లు, గేదెలు 36 డి.సె.లు, కుందేళ్లు 30 డి.సె.ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. 

ఎండ దెబ్బ లక్షణాలు..
నాడి వేగంగా, బలహీనంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు, పేడ ఉష్ణోగ్రత పెరగడం, అసాధారణంగా సొంగ కారటం, మైకం/అపస్మారక స్థితికి చేరటం, చర్మం చల్లగా, నిస్తేజంగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక తాపం వల్ల సంకర జాతి ఆవుల్లో 15–20%, గేదెల్లో 10–15% పాల దిగుబడితోపాటు వెన్న శాతం పడిపో తుంది. 

ఉష్ణ తాపానికి గురైన పశువుకు చూలు నిలవదు. ఉదయం 6 –11 గంటలలోపు.. సాయంత్రం 4–6 గంటల మధ్యలోనే మేతకు వదలాలి. పచ్చిమేతతోపాటు దాణాను పగలు, ఎండు గడ్డిని రాత్రి పూట వేయాలి. రోజుకు 100 గ్రా. చొప్పున పొటాషి యం అధికంగా ఉండే ఖనిజ లవణాల మిశ్రమం ఇవ్వాలి. 

షెడ్ల ఎత్తు కనీసం 9 అడుగులు 
పశువుల షెడ్లను తూర్పు–పడమర దిశలో 9 అడుగుల ఎత్తున నిర్మించాలి. పాకల చుట్టూ అవిశె, మునగ, సుబాబుల్‌ చెట్లు పెంచాలి. షెడ్ల పైకప్పులకు తెల్లని రంగువేసి, ఆపైన గడ్డి, తాటి/ కొబ్బరి /పామాయిల్‌ ఆకుల్ని కప్పాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంటకొకసారి చల్లని నీటితో పశువుల ఒళ్లు తడపాలి. 

పాకల చుట్టూ గోనె సంచులు/ 20% షేడ్‌ నెట్‌ కట్టి, తడుపుతూ ఉండాలి. అధికంగా పాలిచ్చే ఆవులు, ముర్రా గేదెల కోసం ఫ్యాన్‌ బిగించాలి. గోనె సంచులను నడుముపైన కప్పి, 2–3 సార్లు తడపాలి. షెడ్లపైన స్ప్రింక్లర్లు బిగించాలి. వేసవిలో పశువులకు దాదాపుగా రెట్టింపు తాగునీరు అవసరం. 

ఈ జాగ్రత్తలు తీసుకోండి..
పశువుల ఆరోగ్యం, ఆహారం, నీటిసరఫరా, శరీర పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలి. ఎండదెబ్బ తగిలిన పశువును చల్లని ప్రదేశానికి తరలించి, చల్లటి నీటితో స్నానం చేయించాలి లేదా తడి దుప్పట్లలో చుట్టి, ఫ్యాన్‌ గాలి అందేలా చూసుకోవాలి. గొర్రెలు, మేకలకు సరైన నట్టల మందులు ఎంచుకోవాలి. వేసవి వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సిన్లు వేయించాలి. చల్లటి నీటితో స్నానాలు చేయించాలి. చల్లని తాగునీటిని అందించాలి. 

కోళ్ల పెంపకంలో వేసవి జాగ్రత్తలు..
» కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో నిండి ఉంటుంది. వాటి శరీరంలో చమట గ్రంధులు లేవు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ కంటే బయటి ఉష్ణోగ్రత పెరిగితే తట్టుకోలేవు. 
» వేడి ఒత్తిడికి గురైన కోడి పిల్లలు నీరస్తాయి. విరేచనాలవుతాయి. నిలబడ లేవు. వణుకుతుంటాయి. ఈ లక్షణాలుంటే మందులు వేయించాలి. కోళ్లు మెడలు వాల్చి, సన్నగా మూలుగుతూ, కళ్ల నుంచి నీరు కార్చుతున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరుచేసి సరైన చికిత్స అందించాలి. 
»  షెడ్డు ఎత్తు 10 అడుగులుండాలి. దాణా తెల్లవారుజాము, రాత్రి వేళల్లో ఇవ్వాలి. దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంతమేర తగ్గించాలి. సి–విటమిన్‌ ఎక్కువగా ఇవ్వాలి. 
» ఒక టన్ను దాణాలో 100 గ్రాముల విటమిన్‌–సి, 50 గ్రాముల విటమిన్‌–ఇ ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మితియోనైన్‌ అనే అమైనోఆమ్లం దాణాలో కలిపి ఇవ్వాలి. అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్‌ 0.25 శాతం ఇస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. 
» వేసవిలో దాణా, నీటిని 1:2 నిష్పత్తిలో ఇవ్వాలి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు వంటివి కలిపితే అవి ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు చల్లని నీటినే ఇవ్వాలి. షెడ్డుపైన గడ్డి కప్పి, స్ప్రింక్లర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండవేళల్లో అర గంటకొకసారి నీళ్లు చల్లాలి.

Advertisement
 
Advertisement
Advertisement