సాక్షి, హైదరాబాద్: జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలు, అంకితభావం, సేవానిరతిని స్మరించుకున్నారు. వారి త్యాగాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గవర్నర్‌ను కలిసిన పలువురు ప్రముఖులు
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను లోక్‌భవన్‌లో పలువురు ప్రముఖులు బుధవారం కలిశారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, హైదరాబాద్‌లోని మాతా అమృతానందమయి మఠానికి చెందిన స్వామి అమృతపుత్ర నందపురి, తెలంగాణ ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ గవర్నర్‌ను వేర్వేరుగా కలిసి మాట్లాడారు.
కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షాకు గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
ఈ నెల 22 వ తేదీన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజల తరఫున, తన తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీస్సులతో అమిత్ షా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, దేశ సేవలో మరింత శక్తిసామర్థ్యాలతో కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. అమిత్ షా సమర్థవంతమైన, దార్శనిక నాయకత్వంలో దేశం అభివృద్ధి, ప్రగతి, సుసంపన్నత దిశగా మరింత పురోగమించాలని ప్రార్థించారు.


