ఓ మై 'గాడ్‌' | Cyber ​​security experts say vigilance is needed over suspicious links | Sakshi
Sakshi News home page

ఓ మై 'గాడ్‌'

Apr 20 2026 4:26 AM | Updated on Apr 20 2026 4:29 AM

Cyber ​​security experts say vigilance is needed over suspicious links

దేవుడి పేరుతో దోపిడీ.. ఆధ్యాత్మిక యాత్రల బుకింగ్‌ పేరిట సైబర్‌ వల

వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లలో లింకులు

అనుమానాస్పద లింక్‌లపై అప్రమత్తత అవసరమన్న సైబర్‌ భద్రతా నిపుణులు

వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేందుకు ముందస్తుగా బుకింగ్‌లు చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ వెబ్‌సైట్‌లతో మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చార్‌ధామ్, కాశీ యాత్రలు, ఉత్తర భారతదేశంలో దర్శనీయ ప్రదేశాలకు హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, స్థానికంగా టూర్‌ ప్యాకేజీలు, ట్యాక్సీలు ముందుగా బుక్‌ చేసుకుంటే భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు పొందొచ్చని ఊదరగొడుతున్నట్టు పేర్కొన్నారు. 

వాట్సాప్, సాధారణ మెసేజ్‌లలో నకిలీ వెబ్‌సైట్‌లు, సోషల్‌ మీడియా పేజీల లింక్‌లు, వాట్సాప్‌ నంబర్లు, స్పాన్సర్డ్‌ ప్రకటనల ద్వారా నకిలీ బుకింగ్‌లను ఇస్తున్నట్టు వారు హెచ్చరించారు. వాట్సాప్, సాధారణ ఎస్‌ఎంఎస్‌లలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయొద్దని సూచించారు. – సాక్షి, హైదరాబాద్‌

ఇలా మోసగిస్తున్నారు...
నకిలీ బుకింగ్‌ వెబ్‌సైట్‌లు : ఈ వెబ్‌సైట్‌లు అధికారికంగా కనిపిస్తాయి. టూర్‌ ప్యాకేజీ పేరిట డబ్బు వసూలు చేసిన తర్వాత అవి అదృశ్యమవుతాయి.
నకిలీ వాట్సాప్, టెలిగ్రామ్‌ ఏజెంట్లు : ఈ నకిలీ ఏజెంట్లు సదరు ఆలయాల, ట్రావెల్‌ ప్రతినిధులుగా నటిస్తూ, ముందుగా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించేలా ఒత్తిడి చేస్తారు. తర్వాత ఫోన్లకు బదులివ్వడం మానేస్తారు. 
స్పాన్సర్డ్‌ గూగుల్, ఫేస్‌బుక్‌ ప్రకటనలు : మనం ఏదైనా యాత్ర గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేయగానే వారి యాడ్స్‌ వచ్చేలా మోసగాళ్లు కొన్నిసార్లు స్పాన్సర్డ్‌ గూగుల్‌ యాడ్స్, ఫేస్‌బుక్‌ ప్రకటనలు ఇస్తున్నారు.

ఎలా గుర్తించాలి ?
» భారీ తగ్గింపులు లేదా చివరి కొన్ని స్లాట్‌లు అంటూ ఆఫర్లు పెడితే అనుమానించాలి. 
» సదరు సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతాలకు కాకుండా వ్యక్తిగత యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టయితే మోసమని గుర్తించాలి. 
» ఎలాంటి అధికారిక రశీదు లేకపోవడం, కేవలం వాట్సాప్‌ ద్వారా మాత్రమే సంప్రదింపులు చేస్తున్నా...
» వింత డొమైన్‌ పేర్లతో కొత్త వెబ్‌సైట్‌లు, ధ్రువీకరించదగిన కస్టమర్‌ సపోర్ట్‌ లేకపోవడం.. డబ్బు వెంటనే చెల్లించమని ఒత్తిడి చేస్తే కూడా అది మోసమని గ్రహించాలి. 

ఈ జాగ్రత్తలు మరవొద్దు. 
» దేవాలయ, పర్యాటక శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లు, పోర్టల్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోండి.
» ఫోన్‌ నంబర్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ధ్రువీకరించుకోండి. 
» సోషల్‌ మీడియా పోస్ట్‌లలో వచ్చే బుకింగ్‌ లింక్‌లను క్లిక్‌ చేయొద్దు. 
» వెబ్‌సైట్‌ రివ్యూలు, డౌన్‌లోడ్‌ల సంఖ్య తదితర వివరాలు తప్పకుండా తనిఖీ చేయండి.
» వాట్సాప్‌ కాల్స్‌లో సంప్రదించే గుర్తు తెలియని ఏజెంట్లకు ఎప్పుడూ పూర్తి మొత్తాన్ని ముందుగానే చెల్లించొద్దు.
» ఆన్‌లైన్‌లో చెల్లింపుల సమయంలో ఇబ్బందులు సృష్టించి క్రెడిట్‌ కార్డ్, డెబిట్‌ కార్డుల నంబర్లు వివరాలు అడిగితే ఇవ్వొద్దు. 

Advertisement
 
Advertisement
Advertisement