నీట్‌లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం | Sakshi
Sakshi News home page

నీట్‌లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం

Published Wed, May 8 2024 8:50 AM

-

● కలెక్టర్‌కు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు

సాక్షి, చైన్నె: నీట్‌ పరీక్షలో ఒకే ప్రాంతంలోని మూడు కేంద్రాలలో భిన్న ప్రశ్నపత్రాలను అందజేసినట్టుగా ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు తూత్తుకుడి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల పెట్టెలో వేసి వెళ్లిన లేఖలపై అధికారులు మంగళవారం దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఆదివారం నీట్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. తూత్తుకుడిలోని మూడు కేంద్రాలలో 760 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల అనంతరం ఆయా శిక్షణ కేంద్రాలకు వెళ్లిన విద్యార్థులు ప్రశ్నపత్రాలలోని ప్రశ్నలకు సమాధానాలపై దృష్టి పెట్టారు. అయితే భిన్న ప్రశ్నపత్రాలు తమకు ఇచ్చి ఉండడంతో కలవరం చెందారు. ఓ కేంద్రంలో క్యూర్‌ఎస్‌టీ కోడ్‌ రూపంలో, మరో కేంద్రంలో ఎంఎన్‌ఓపీ వరుసలో ప్రశ్నలు ఉండడంతో ఆందోళన చెందారు. దీంతో తమ తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులు తూత్తుకుడి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో అధికారులు నేరుగా ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించ లేని పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. కలెక్టరేట్‌ ఆవరణలోని బాక్సులో ఈ ఫిర్యాదును, తమ వద్ద ఉన్న ప్రశ్న పత్రాల జెరాక్స్‌లను జత పరిచి వేసి వెళ్లడం మంగళవారం వెలుగు చూసింది. ఈ భిన్న ప్రశ్నపత్రాల గందరగోళం గురించి జాతీయ స్థాయిలోని నీట్‌ వర్గాల దృష్టికి తీసుకెళ్లాలని, తమ ఆందోళనను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొని ఉండటంతో అధికారులు పరిశీలన ప్రారంభించారు.

Advertisement
Advertisement