ఆదాయ వనరులు పెంచుకోవాలి | Sakshi
Sakshi News home page

ఆదాయ వనరులు పెంచుకోవాలి

Published Thu, Nov 30 2023 1:20 AM

ఉపాధి వేతనదారులతో మాట్లాడుతున్న సహాయ కమిషనర్‌ అశోక్‌    - Sakshi

నరసన్నపేట: ఉపాధి వేతనదారులు ఆదాయ వనరులను పెంచుకున్నప్పుడే కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సహాయ కమిషనర్‌ (విజయవాడ) అశోక్‌ అన్నారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తామరాపల్లిలో ఉపాధి వేతనదారులతో మాట్లాడారు. రోజువారీ వేతనం, పని గంటలపై ఆరా తీశారు. సొంత పొలాలు ఉంటే వాటిలో పండ్ల తోటలు పెంచుకుంటే ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పారు. వాటి ద్వారా కూడా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. భూములు ఉన్న రైతులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు, నరసన్నపేట ఏపీఎం యుగంధర్‌, ఈసీ అప్పలరాజు, వైఎస్సార్‌ సీపీ నాయకులు ముచ్చ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

యాంటీ బయాటిక్స్‌

వాడకం తగ్గించాలి

గార: చేపలు, రొయ్యల పెంపకంలో యాంటీబయాటిక్స్‌ వాడకం తగ్గించాలని జిల్లా మత్స్యశాఖ జేడీ పి.వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం గార మండలం శ్రీకూర్మం పంచాయతీలో చేపలు, రొయ్యల పెంపకందారులకు కేంద్రప్రభుత్వ సంస్థ నాస్కా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాక్టీరియా, వైరస్‌, శిలీంధ్రాలు, పరాన్నజీవులు కాలక్రమేణా మారినప్పుడు, మందులకు ప్రతిస్పందించనప్పుడు అంటువ్యాధులను నివారించడం కష్టతరమవుతుందన్నారు. వ్యాధి వ్యాప్తి తీవ్రమై మరణాల రేటు పెరుగుతుందన్నారు. ఈ క్రమంలో యాంటిబయాటిక్స్‌ విస్తృతంగా ఉపయోగిస్తే మరిన్ని సమస్యలు ఏర్పడతాయన్నారు. మెరుగైన నీటి నాణ్యత వంటి ఆక్వాకల్చర్‌ పద్ధతులను అమలు చేయడంతో వ్యాధి నియంత్రణ చేపట్టవచ్చని చెప్పారు. కార్యక్రమంలో నాక్సా ఆర్‌సీవో ఎన్‌పీ చంద్రశేఖర్‌, ఏఎంఆర్‌ డాక్టర్‌ సీహెచ్‌.బాలకృష్ణ, డాక్టర్‌ షణ్ముఖ, ఎస్‌.బాలాజీ, గోర సురేష్‌, పి.రాము తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం కేంద్రంగా వర్సిటీ, అఫిలియేషన్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ మూడో సెమిస్టర్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయని ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. డిసెంబర్‌ 8 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సైన్స్‌ కోర్సుల నుంచి 375, ఆర్ట్స్‌ కోర్సుల నుంచి 143 మంది హాజరు కానున్నారని తెలిపారు.

9న జాతీయ లోక్‌ అదాలత్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: డిసెంబర్‌ 9న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో వీలైనంత ఎక్కువగా క్రిమినల్‌ కేసులు రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. బుధవారం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్‌ హాలులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయన్నారు. పోలీస్‌ స్టేషన్లకు, కోర్టులకు కూడా పని భారం తగ్గుతుందన్నారు. సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు శ్రీదేవి, మహేంద్ర ఫణికుమార్‌, భాస్కరరావు, అడిషనల్‌ సీనియర్‌ న్యాయమూర్తి అనురాధ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు, అడిషనల్‌ ఎస్పీ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు
1/2

సమావేశంలో మాట్లాడుతున్న మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు

మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా
2/2

మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

Advertisement
Advertisement