హుదూద్‌ ఇళ్లకు మోక్షం | Sakshi
Sakshi News home page

హుదూద్‌ ఇళ్లకు మోక్షం

Published Thu, Nov 30 2023 1:20 AM

టెక్కలిలో లబ్ధిదారుల కోసం సిద్ధమైన హుదూద్‌ ఇళ్లు  - Sakshi

● టెక్కలి నియోజకవర్గంలో 558 గృహాల నిర్మాణాలు ● నేడు తొలి విడతగా 90 మందికి లాటరీ విధానంలో కేటాయింపు ● గత టీడీపీ హయాంలో ఇళ్లు పంచుకునేందుకు ప్రయత్నించిన తెలుగుతమ్ముళ్లు ● ప్రస్తుత ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు అందేలా చర్యలు

టెక్కలి: దాదాపు దశాబ్ద కాలంలో టెక్కలి నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న హుదూద్‌ ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హుదూద్‌ ఇళ్లను పంచుకోవాలని తెలుగు తమ్ముళ్లు విశ్వప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. టెక్కలి మండలానికి సంబంధించి సుమారు 90 మంది లబ్ధిదారులకు హుదూద్‌ ఇళ్లు కేటాయించేందుకు గురువారం లాటరీ ప్రక్రియ చేపట్టనున్నారు. టెక్కలి తహసీల్దారు కార్యాలయం ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ తిసి అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించేందుకు అధికారులు జాబితాలు సిద్ధం చేశారు.

పంచుకునేందుకు ప్రయత్నం..

2014లో సంభవించిన హుదూద్‌ తుఫాన్‌ ధాటికి నిరాశ్రయులైన వారి కోసం టెక్కలిలో 192, సంతబొమ్మాళిలో 176, కోటబొమ్మాళిలో 192 హుదూద్‌ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గత టీడీపీ హయాంలో ఆ ఇళ్లను పంచుకోవడానికి ఆ పార్టీ కార్యకర్తలు విశ్వప్రయత్నాలు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఇదే సమయంలో ఎన్నికలు సమీపించడంతో వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఇప్పుడు ఎట్టకేలకు హుదూద్‌ ఇళ్లకు మోక్షం కలిగింది.

అర్హులకే అందేలా..

హుదూద్‌లో నిరాశ్రయులైన వారి కోసం నిర్మించిన 558 ఇళ్లను గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు దోచుకోవాలని ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని నిరుపేదల కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో మూలనపడిన హుదూద్‌ ఇళ్లను పేదలకు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడతగా టెక్కలి మండలంలో 90 మందికి లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తారు. ఆ తరువాత మిగిలిన మండలాల్లో అర్హులైన ఇళ్లు అందిస్తారు.

– దువ్వాడ వాణి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త

1/1

Advertisement
Advertisement