Yashasvi Jaiswal Equals Virat Kohli Unique Record Following His 98 Run Knock Against KKR - Sakshi
Sakshi News home page

KKR VS RR: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..!

May 12 2023 5:11 PM | Updated on May 12 2023 5:46 PM

Yashasvi Jaiswal Equals Virat Kohli Unique Feat Following His 98 Run Knock Against KKR - Sakshi

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో నిన్న (మే 11) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్లు పలు రికార్డులను కొల్లగొట్టారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ (143 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు) అవతరించగా.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి రికార్డును (13 బంతుల్లో) జైస్వాల్‌ బద్దలు కొట్టాడు. ఈ రెండు ఐపీఎల్‌ అత్యుత్తమ రికార్డులతో పాటు పలు సాధారణ రికార్డులు సైతం ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో డెత్‌ ఓవర్లలో (16 నుంచి  20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చహల్‌ (11) రికార్డుల్లోకెక్కగా, బంతుల పరంగా రాజస్థాన్‌ ఐపీఎల్‌లో రెండో అతి పెద్ద విజయాన్ని (41) నమోదు చేసింది.

అయితే, ఇన్ని రికార్డుల మధ్య ఒక్క రికార్డును మాత్రం ఎవరూ నోటీస్‌ చేయలేదు. ఈ మ్యాచ్‌ తొలి ఓవర్‌లో (నితీశ్‌ రాణా బౌలింగ్‌) తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి.. ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి తర్వాత ఈ ఫీట్‌ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2019లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులను బ్యాక్‌ టు బ్యాక్‌ సిక్సర్లుగా మలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. యశస్వి (47 బంతుల్లో 98 నాటౌట్‌; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (29 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల సునామీ సృష్టించిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై రాజస్థాన్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. రాజస్థాన్‌ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. కేకేఆర్‌ ఏడో స్థానంలో నిలిచింది. 

చదవండి: జైస్వాల్‌ సెంచరీ చేయకుండా అడ్డుకున్న సుయాశ్‌.. ఏకి పారేసిన ఆకాశ్‌

Advertisement
 
Advertisement
Advertisement