మహిళల గేమ్‌ మారింది | Sindhus chat with the media is in her own words | Sakshi
Sakshi News home page

మహిళల గేమ్‌ మారింది

Jun 27 2025 3:59 AM | Updated on Jun 27 2025 3:59 AM

Sindhus chat with the media is in her own words

సుదీర్ఘ ర్యాలీలతో సామర్థ్యానికి పరీక్ష

ఫిట్‌నెస్‌ కీలకం

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వ్యాఖ్య  

బెంగళూరు: భారత మహిళల బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్‌ జోష్‌ తెస్తే... పతకాలు, ఘన విజయాలతో ముఖచిత్రాన్నే మార్చిన స్టార్‌ షట్లర్‌ మాత్రం ముమ్మూటికి పీవీ సింధునే! ఒలింపిక్‌ పతకాలు, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల పతకాలతో చైనాకు సవాల్‌గా నిలిచిన బ్యాడ్మింటన్‌ తార సింధు కొంతకాలంగా పతకాల వేటలో వెనుకబడింది. అయితే రేసులో వెనుకబడినా... తన సత్తాలో ఏ మార్పూ లేదని చెప్పింది. 

ఆధునిక మహిళల బ్యాడ్మింటన్‌ ఆటతీరు చెప్పుకోదగ్గ స్థాయిలో మారిందని వివరించింది. కోర్టులో ఎదురుపడే ప్రత్యర్థులే కాదు... సుదీర్ఘ ర్యాలీలు సైతం మహిళా షట్లర్ల సామర్థ్యానికి కఠిన పరీక్ష పెడుతున్నాయని చెప్పింది. ఇక్కడి స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రానికి వచ్చిన సింధు మీడియాతో ముచ్చటించిన కబుర్లు ఆమె మాటల్లోనే... 

‘సింగిల్స్‌’ అప్పట్లా లేదు 
బ్యాడ్మింటన్‌లో ప్రత్యేకించి మహిళల సింగిల్స్‌ పూర్తిగా మారింది. మొదట్లో అటాకింగ్, వేగవంతమైన ర్యాలీలే కనిపించేవి. మ్యాచ్‌ను ముగించేవి. కానీ ఇప్పుడు సుదీర్ఘ ర్యాలీలు మరింత పోటీని తెచ్చాయి. దీని వల్ల మ్యాచ్‌లు పోటాపోటీగా చాలా సేపు సాగుతున్నాయి. ప్రతీ పాయింట్‌ను కాపాడుకునేందుకు రక్షణాత్మక ధోరణితో ఆడుతుండటంతోనే మ్యాచ్‌ల టైమింగ్‌ పెరుగుతోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టే మన ఆటతీరు మార్చుకోవాల్సిందే. 

ఫిట్‌నెస్‌ కీలకం 
ఆటలో దూకుడు కనబర్చాలంటే... అభివృద్ధి చెందుతున్న టెంపోకు అనుగుణంగా మన ఆటతీరును మార్చాలంటే ఫిట్‌నెసే కీలకం. అందుకే నేను నా శారీరక సత్తాను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. అప్పుడే నేను సహనంతో కోర్టులో ఎంతసేపైనా ఆడగలుగుతాను. ఇప్పుడు ప్రత్యర్థిపై ఫోకస్‌ కంటే ఇలాంటి మార్పులపైనే మరింత దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. కొత్త కోచ్‌ కూడా సుదీర్ఘ సమయం ఆడటంపైనే శిక్షణ ఇస్తున్నారు.  

ఎప్పుడూ ఒకేలా ఉండలేం 
ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఒకేలా ఉండలేరు. ఆడలేరు. పదేళ్ల క్రితం ఆడిన ఆటే ఇప్పుడు ఆడాలంటే ఎలా? అప్పటి ఆట, శిక్షణ, పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్లు వేరు. ఇవన్నీ అర్థం చేసుకొని ఆడగలగడమే ముఖ్యం. అయితే కెరీర్‌లో నా సాఫల్యాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. కామన్వెల్త్, ఆసియా, ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలన్నీ గెలిచాను. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడితే చాలు. మళ్లీ పతకాల బాట పట్టొచ్చు.  

ఫలితాలు నిరాశ పరిచాయి 
కొన్నాళ్లుగా కోర్టులో ఫలితాలు, నా ఆటతీరు నిరాశపరిచిన మాట నిజమే. అయితే ఈ వైఫల్యాలను అధిగమించేందుకు ఇటీవల తీవ్రమైన కసరత్తులు చేశాను. ఐదారు టోర్నీల్లో తొలి రౌండ్లలోనే ఓడిపోయాను. ఇప్పుడలా ఉండదు. తప్పకుండా మెరుగైన ఆటతీరునే చూస్తారు. క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైనపుడే మనం మరింత కష్టపడతాం. నేను కూడా అంతే సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను.

Advertisement
 
Advertisement
Advertisement