నేను సాకులు చెప్ప‌ను.. యుద్దం ఇంకా ముగియ‌లేదు: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyers Blunt Take On RCB Humiliation In IPL 2025 Qualifier 1 | Sakshi
Sakshi News home page

నేను సాకులు చెప్ప‌ను.. యుద్దం ఇంకా ముగియ‌లేదు: శ్రేయస్‌ అయ్యర్‌

May 30 2025 11:58 AM | Updated on May 30 2025 12:47 PM

Shreyas Iyers Blunt Take On RCB Humiliation In IPL 2025 Qualifier 1

ఐపీఎల్‌-2025లో గురువారం ముల్లాన్​పుర్ వేదికగా ఆర్సీబీతో జ‌రిగిన‌ క్వాలిఫయర్‌ 1లో పంజాబ్ కింగ్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫ‌ల‌మైన పంజాబ్‌.. 8 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మి చ‌విచూసింది. దీంతో ఫైన‌ల్ చేరేందుకు ఇప్పుడు క్వాలిఫ‌య‌ర్‌-2లో త‌ల‌ప‌డాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 14.1 ఓవ‌ర్ల‌లోనే కేవ‌లం 101 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

స్టోయినిష్‌(26) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ ఘోర ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే ఓట‌మిపాలైమ‌ని అయ్య‌ర్ అంగీక‌రించాడు. ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు.

"ఈ రోజును అంత‌వేగంగా మ‌ర్చిపోలేము. డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లి త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో చ‌ర్చిస్తాము. ఏదేమైనప్పటికీ ఒక బ్యాటింగ్ యూనిట్‌గా తీవ్ర నిరాశ‌ప‌రిచాము. వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయాయు. అయితే కెప్టెన్‌గా నేను తీసుకున్న నిర్ణ‌యాల‌పై నాకు ఎటువంటి సందేహం లేదు. మైదానంలో గానీ, మైదానం వెలుప‌ల గానీ మేము అన్ని ఆలోచించాకే ఏ నిర్ణ‌య‌మైనా తీసుకుంటాము. ఈ మ్యాచ్‌లో మాత్రం మా ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోయాము. 

అలా అని బౌలర్లను కూడా త‌ప్పుబ‌ట్ట‌లేము. ఎందుకంటే మా బౌల‌ర్లు డిఫెండ్ చేసుకోవడానికి ఈ టోట‌ల్ సరిపోదు. ముల్లాన్‌పూర్ పిచ్‌ను మేము స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోయాము. ఈ వికెట్‌పై బ్యాటింగ్ ప‌రంగా మ‌రింత ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. ఈ మైదానంలో మేము ఆడిన మూడు మ్యాచ్‌ల‌లోనూ బౌన్స్ ఎక్కువ‌గా ఉంది. 

అయితే మేము ప్రొఫెషనల్ క్రికెట‌ర్లు కాబట్టి, ఇటువంటి సాకులు చెప్పాల‌ని అనుకోవ‌డం లేదు. ప‌రిస్థితులు ఎలా ఉన్న అందుకు త‌గ్గ‌ట్టు బ్యాటింగ్ చేయాలి. ఇది చిన్న ఓట‌మి మాత్ర‌మే.. యుద్దం ఇంకా పూర్తిగా ముగియ‌లేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో అయ్య‌ర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2025: ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది త‌గునా? ఫ్యాన్స్ కౌంట‌ర్‌

Advertisement
 
Advertisement
Advertisement