బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కోసం భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చీఫ్ సెలెక్టర్ పోస్ట్ కోసం బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనపై జడేజా స్పందిస్తూ.. "ఈ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి విధానం ఏంటి?" అని ప్రశ్నించాడు. సాధారణంగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని జడ్డూ నుంచి ఇలాంటి కామెంట్ రావడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న నేపాల్ క్రికెట్‌కు సంబంధించిన అంశంపై అశ్విన్‌తో మాట్లాడిన జడేజా, మళ్లీ ఇన్నాళ్లకు నేరుగా బీసీసీఐ పోస్ట్‌కు రీట్వీట్ చేయడం గమనార్హం.
జడ్డూ - అగార్కర్ మధ్య విభేదాలు ఉన్నాయా?
అగార్కర్‌ను ఉద్దేశించే జడేజా ఈ కామెంట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రవీంద్ర జడేజా, అజిత్ అగార్కర్ మధ్య బహిరంగంగా ఎలాంటి వివాదాలు బయటపడకపోయినా.. అతడి హయాంలో భారత టీ20 జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమి తర్వాత, సీనియర్ల స్థానంలో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అగార్కర్ నిర్ణయించారు.
ఇందులో భాగంగానే టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. అంతేకాకుండా 2024లో శ్రీలంకతో, 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లకు కూడా జడేజాను అగార్కర్ పక్కన పెట్టారు. అగార్కర్ మాత్రం జడేజా వన్డే సెటప్‌లో భాగమేనని చెబుతూ వచ్చినప్పటికీ, వరుస సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడంపై జడేజా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా జడేజా మాట్లాడుతూ.. "ఎంపిక అనేది నా చేతుల్లో లేదు. ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్లకు వారి ఆలోచనలు ఉంటాయి. నన్ను ఎంపిక చేయకపోవడానికి వారి వద్ద స్పష్టమైన కారణాలు ఉండివుంటాయి.
జట్టు ప్రకటనకు ముందే వారు నాతో మాట్లాడారు. కాబట్టి ఇది నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు" అని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య బహిరంగంగా ఎలాంటి వివాదాలు లేనప్పటికీ, పరిస్థితులు మాత్రం అంత బాగులేవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చదవండి: జట్టు ప్రకటన.. మహ్మద్ షమీకి చోటు


