కుప్పకూలిన టీమిండియా.. తొలి రోజు న్యూజిలాండ్‌దే పైచేయి | India Test regulars crumble as NZ A dominate opening day | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన టీమిండియా.. తొలి రోజు న్యూజిలాండ్‌దే పైచేయి

Oct 24 2026 11:55 AM | Updated on Oct 24 2026 12:40 PM

India Test regulars crumble as NZ A dominate opening day

source: X

భారత-ఏ జట్టుకు న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి రోజే భంగపాటు ఎదురైంది. ఇవాళ మొదలైన తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి 113 పరుగులకే కుప్పకూలింది. 

భారత టెస్ట్‌ జట్టు రెగ్యులర్‌ సభ్యులు తీవ్రంగా నిరాశపరిచారు. కేఎల్‌ రాహుల్‌ సహా ఐదుగురు సభ్యులు (సాయి సుదర్శన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌దీప్‌, ముకేశ్‌ చౌదరి) డకౌట్లయ్యారు. యశ్‌ రాథోడ్‌ (44 నాటౌట్‌), పడిక్కల్‌ (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. యశస్వి జైస్వాల్‌ 17, జురెల్‌ 1, కంబోజ్‌ 10, ఆకిబ్‌ నబీ 5 పరుగులకే పరిమితమయ్యారు. న్యూజిలాండ్‌-ఏ బౌలర్లలో సైమన్‌ కీన్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జాక్‌ గిబ్సన్‌ 3, ఫ్రేసర్‌ షీట్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌-ఏకు ఓపెనర్లు మర్లు (76), కర్టిస్‌ హీఫీ (37 నాటౌట్‌) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరే తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించి భారత్‌ స్కోర్‌ను అధిగమించేలా చేశారు. కెప్టెన్‌ మర్లు ఔటయ్యాక న్యూజిలాండ్‌ కాస్త తడబాటుకు లోనైంది. 

ఆకిబ్‌ నబీ చెలరేగి వరుస బంతుల్లో జేడన్‌ లెన్నాక్స్‌, టిమ్‌ రాబిన్సన్‌ను డకౌట్‌ చేశాడు. దీంతో న్యూజిలాండ్‌ పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయినట్లైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌పై ఆ జట్టు 22 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. హీఫీ (37), బాయిల్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, త్వరలో భారత జట్టు న్యూజిలాండ్‌లో టెస్ట్‌ సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ నిమిత్తం పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టులోని చాలామంది సభ్యులు భారత్‌-ఏ తరఫున న్యూజిలాండ్‌-ఏతో అనధికారిక​ టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్నారు. ఈ క్రమంలో భారత టెస్ట్‌ జట్టు సభ్యులకు తొలి ప్రయత్నంలోనే భంగపాటు ఎదురైంది. యశ్‌ రాథోడ్‌ మినహా జట్టు మొత్తం ఘోరంగా విఫలమైంది.

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి కుమార్ కుషాగ్రా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement