ఆస్ట్రేలియా X శ్రీలంక | Australia vs Sri Lanka first Test from today | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా X శ్రీలంక

Jan 29 2025 4:22 AM | Updated on Jan 29 2025 4:22 AM

Australia vs Sri Lanka first Test from today

నేటి నుంచి తొలి టెస్టు

ఉదయం 10 గంటల నుంచి  సోనీ స్పోర్ట్స్‌ టెన్‌–5 చానెల్‌లో, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

గాలె: ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్న ఆ్రస్టేలియా జట్టు బుధవారం నుంచి శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌ జట్టు శ్రీలంకతో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినివ్వగా... స్టీవ్‌ స్మిత్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డుపడే అవకాశాలుండగా... ఆస్ట్రేలియా జట్టు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ ట్రావిస్‌ హెడ్‌ను ఓపెనర్‌గా దింపాలని యోచిస్తోంది. ‘ట్రావిస్‌ టాపార్డర్‌లో బరిలోకి దిగుతాడు. భారత్‌లో అతడు ఓపెనర్‌గా రాణించిన అంశాన్ని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. కొత్త బంతితో హెడ్‌ వేగంగా పరుగులు రాబట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయగలడు. 

లంకలోనూ అదే చేస్తాడనే నమ్మకముంది’ అని స్మిత్‌ పేర్కొన్నాడు. హెడ్‌ ఓపెనర్‌గా ప్రమోషన్‌ దక్కించుకుంటే... టీమిండియాతో ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో చక్కటి ప్రదర్శన కనబర్చిన 19 ఏళ్ల యువ ఓపెనర్‌ స్యామ్‌ కొన్‌స్టాస్‌కు జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఇక చాన్నాళ్లుగా ఆసీస్‌ తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తున్న జోష్‌ ఇంగ్లిస్‌ ఈ సిరీస్‌ ద్వారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు స్మిత్‌ సూచనలిచ్చాడు. 

మ్యాచ్‌కు ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించాలని ఆసీస్‌ భావించినా... వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తామని స్మిత్‌ వెల్లడించాడు. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన శ్రీలంక... సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన చేసి కంగారూల విజయయాత్రకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది.

కాగా... గాయం కారణంగా తొలి టెస్టు నుంచి లంక ఓపెనర్‌ నిసాంక దూరమయ్యాడు. అతడి స్థానంలో ఒషాడా ఫెర్నాండో జట్టులోకి రానున్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైనప్పటికీ... ఈ సిరీస్‌ను 2–0తో గెలుచుకుంటే పట్టికలో మూడో స్థానంలో నిలిచే అవకాశం మా జట్టుకు ఉంది. అది మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది’ అని శ్రీలంక సారథి ధనంజయ డిసిల్వా అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement