భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్‌ యువ ఓపెనర్‌ సంచలన నిర్ణయం | Australia Star Pucovski Aged 27 Announces Shock Retirement Reason Is | Sakshi
Sakshi News home page

టీమిండియాతో మ్యాచ్‌లో అరంగేట్రం.. ఆసీస్‌ యువ ఓపెనర్‌ సంచలన నిర్ణయం

Apr 8 2025 11:16 AM | Updated on Apr 8 2025 1:05 PM

Australia Star Pucovski Aged 27 Announces Shock Retirement Reason Is

ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ విల్‌ పకోవ్‌స్కీ (Will Pucovski) సంచలన ప్రకటన చేశాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. తరచూ గాయాల బారిన పడటమే ఇందుకు కారణమని 27 ఏళ్ల ఈ విక్టోరియా బ్యాటర్‌ స్పష్టం చేశాడు.

కాగా దేశీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన యువ తార విల్‌ పకోవ్‌స్కీ. తన అద్భుత నైపుణ్యాల కారణంగా అభిమానులతో జూనియర్‌ రిక్కీ పాంటింగ్‌ (Ricky Ponting) అంటూ నీరాజనాలు అందుకున్నాడు. విక్టోరియా తరఫున కఠినమైన వాకా (WACA) పిచ్‌పై వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచి.. ఆసీస్‌ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

టీమిండియాతో మ్యాచ్‌లో అరంగేట్రం
ఈ క్రమంలో 2021లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో టీమిండియా (India vs Australia)తో జరిగిన టెస్టు మ్యాచ్‌ సందర్భంగా పకోవ్‌స్కీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 10 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

ఆఖరిగా గతేడాది మరోసారి గాయం
ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పకోవ్‌స్కీకి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇందుకు ప్రధాన కారణం.. బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో తరచూ అతడి తలకు గాయం కావడం (కంకషన్‌). చివరగా మార్చి 2024లో షెఫీల్డ్‌ షీల్డ్‌ మ్యాచ్‌లో బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పుకోవ్‌స్కీ ఆ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

అదే విధంగా.. ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడేందుకు లీసెస్టర్‌షైర్‌తో 2024లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా పుకోవ్‌స్కీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో 27 ఏళ్ల ఈ ఆసీస్‌ బ్యాటర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది.

 ఇకపై క్రికెట్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నా
తన నిర్ణయం గురించి మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే అనుకుంటున్నాను. అయితే, ఇకపై నేను ఏ స్థాయిలోనూ క్రికెట్‌ ఆడబోవడం లేదు. గతేడాది కష్టంగా గడిచింది. అందుకే నేను ఇకపై క్రికెట్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నా.

సిడ్నీ మ్యాచ్‌లో శతకం బాదినప్పుడు పరిస్థితులు నాకు అనుకూలంగా మారిపోయాయి అనుకున్నా. మైదానంలో నన్ను నేను నిరూపించుకునేందుకు కఠినంగా శ్రమించాను. కానీ మళ్లీ పాత కథే పునరావృతమైంది’’ అని SEN రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పకోవ్‌స్కీ తెలిపాడు.

కాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 36 మ్యాచ్‌లు ఆడిన విల్‌ పకోవ్‌స్కీ ఏడు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 255. కాగా తన కెరీర్‌లో పకోవ్‌స్కీ పదిసార్లకు పైగా తలకు దెబ్బ తగిలించుకున్నాడు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కోచ్‌గా కొత్త ప్రయాణం
అయితే, ఆటగాడిగా వీడ్కోలు పలికినా కోచ్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టాలని పకోవ్‌స్కీ భావిస్తున్నాడు. మెల్‌బోర్న్‌ ప్రీమియర్‌ క్రికెట్‌ క్లబ్‌కు అతడు కోచ్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. ‘‘వచ్చే ఏడాది మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌కు కోచ్‌గా వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

మెల్‌బోర్న్‌ నాకు సెకండ్‌ హోం లాంటిది. ఆటగాడిగా ఉన్న సమయంలోనూ నాకు ఎంసీసీ నుంచి మద్దతు లభించింది. ఎంసీసీ జూనియర్‌ అకాడమీలో కోచ్‌గా పనిచేసేందుకు నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని పకోవ్‌స్కీ చెప్పుకొచ్చాడు. 

చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు.. రోహిత్‌ రావడం వల్ల..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement