
ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
కొండపాక(గజ్వేల్): విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించేందుకు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం దోహదపడుతుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మర్పడ్గలోని విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం ఆవరణలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ 4,7 యూనిట్ల ప్రత్యేక శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ సేవాభావం వల్ల మనసు, మనిషికి లభించే తృఫ్తి, గౌరవం ఎనలేనిదన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవా దృక్పథాలు అలవర్చేలా ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ఉపయోగపడుతుందన్నారు. సామాజికసేవ నిత్య జీవితంలో భాగం కావాలని కోరారు. అనంతరం క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు పల్లవి, రాణి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.