వైద్యం వికటించి కూలి మృతి | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి కూలి మృతి

Published Tue, Nov 14 2023 12:28 AM

అంబులెన్స్‌ను అడ్డుకుంటున్న మృతుని బంధువులు - Sakshi

● సిరిసిల్లలో ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన ● శవం తరలింపుతో తోపులాట.. ఉద్రిక్తత ● రోడ్డెక్కిన మృతుడి బంధువులు ● పరిహారం అందించిన ఆస్పత్రి వర్గాలు ● కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం తెల్లవా రుజామున వైద్యం వికటించి ఓ నిరుపేద కూలి బలయ్యాడు. బాధితులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చిలుక భీమయ్య(55) ఉపాధి కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. వారం క్రితం ఇంటికి చేరిన భీమయ్యకు కడుపునొప్పి వచ్చింది. సిరిసిల్లలోని పాతబస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. కడుపులో పేగుకు పుండు అయిందని, సర్జరీ చేయాలని రూ.40వేలకు ప్యాకేజీ మాట్లాడి ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ జరిగిన రెండో రోజు భీమయ్య చికిత్స పొందుతూ ఐసీయూలోనే మరణించాడు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వర్గాలు పరిహారం ఇవ్వాలని నిమ్మపల్లి వాసులు పట్టుబట్టారు. భీమయ్యకు నిద్రలోనే గుండెపోటు రావడంతో మరణించాడని, ఆపరేషన్‌ విజయవంతమైందని, కోలుకుంటున్న దశలో గుండెపోటు వచ్చింద.. వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని వైద్యుడు తెలిపారు. ముందుగానే రిస్క్‌ ఉంటుందనే విషయాన్ని రోగి కుటుంబ సభ్యులకు చెప్పామని, ఈమేరకు తమ వద్ద వీడియోగ్రఫీ ఉందని స్పష్టం చేశారు. భీమయ్యకు భార్య అమృత, కొడుకులు నరేందర్‌, గణేశ్‌, కూతురు గౌతమి ఉంది. నిరుపేద కుటుంబం కావడంతో పరిహారం ఇవ్వాలని బాధితులు పట్టుబట్టారు.

శవం బలవంతంగా తరలింపులో ఉద్రిక్తత..

ప్రైవేటు ఆస్పత్రి వర్గాలతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చర్చలు జరుపుతుండగానే.. భీమయ్య శవాన్ని మార్చురీకి అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. మృతుడి కుటుంబ సభ్యులు, పలువురు మహిళలు అడ్డుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, టౌన్‌ సీఐ ఉపేందర్‌, సిరిసిల్ల రూరల్‌ సీఐ సదన్‌కుమార్‌, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది, బీఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించారు. మృతుడి కుటుంబ సభ్యుల నిరసనలతో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. చివరికి ఆస్పత్రి యాజమాన్యం మృతుడి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని నిమ్మపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

చిలుక భీమయ్య(ఫైల్‌)
1/1

చిలుక భీమయ్య(ఫైల్‌)

Advertisement
Advertisement