నేటి మోదీ సభ తెలంగాణకు కీలకం | Sakshi
Sakshi News home page

నేటి మోదీ సభ తెలంగాణకు కీలకం

Published Fri, May 10 2024 5:13 AM

Todays Modi Sabha is crucial for Telangana

ఈ సభలో ఎన్నికల సందేశం ఇస్తారు: కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ఎల్‌బీస్టేడియం సభవేదికగా ఎన్నికల సందేశం ఇస్తారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎల్‌బీస్టేడియంలో జరిగే బహిరంగసభ తెలంగాణకు కీలకమని పేర్కొన్నారు.

 ‘ఐదుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఈ సభలో పాల్గొంటారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు, యువత సభకు రావాలి. మోదీకి మనమంతా అండగా నిలబడాల్సిన అవసరముంది. దీనికంటే ముందు నారాయణపేటలో జరిగే బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారు’అని కిషన్‌రెడ్డి చెప్పారు. గురువారం ఎల్‌బీస్టేడియంలో సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

రిజర్వేషన్లపై రాహుల్‌గాంధీ డైరెక్ట్‌ చేసిన సినిమా ఫ్లాప్‌  
‘అండర్‌ కరెంట్, ఓపెన్‌ కరెంట్‌ ఉంది.. ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తూ బట్టకాల్చి మొహం మీద పడేసే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ చేస్తున్నాయి’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘కేసీఆర్‌ మాటలు ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. నవ్వుకుంటున్నారు. గాడిద గుడ్డు ప్రచారానికే కాంగ్రెస్‌ పరిమితమైంది. తెలంగాణ ప్రజలెవరూ దాన్ని పట్టించుకోవడం లేదు. బీజేపీ హైకమాండ్‌ ఆదేశాలతో మేము 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రజలను కలిశాం. ఏ ఫ్రంట్‌ కూడా మోదీకి ప్రత్యామ్నాయంగా లేదు. 

కాంగ్రెస్‌కు విమర్శించడానికి ఏం లేదు. కాబట్టి దుష్ప్రచారం చేస్తుంది. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలు చేసింది. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మాటలను ఏ ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. రిజర్వేషన్ల అంశంపై డైరెక్ట్‌ చేసిన రాహుల్‌గాంధీ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. సెకండ్, థర్డ్‌ ప్లేస్‌ వస్తుందని రేవంత్‌ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. సబ్‌కాసాత్‌.. సబ్‌ కా వికాస్‌ అనే నినాదంతో ముందుకు వెళుతున్నాం’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement