మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం | Niranjan Reddy is ready to challenge Minister Jupalli Krishna Rao | Sakshi
Sakshi News home page

మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం

Oct 21 2026 10:40 PM | Updated on Oct 21 2026 10:40 PM

Niranjan Reddy is ready to challenge Minister Jupalli Krishna Rao

మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌కు సిద్ధమేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఎల్లూరు రిజర్వాయర్ కు నీళ్లు వస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయం ఫలితమేనని చెప్పారు. ఈ రోజు జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూము నేను కేసీఆర్ అడిగి పెట్టిన మూలంగానే ఏర్పాటు చేశారని చెప్పారు. 

బుధవారం  నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేఎల్ఐ పథకంలో తక్కువ సామర్థ్యంతో నిర్మించిన కాల్వల మూలంగా రైతాంగానికి న్యాయం జరగాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్ నుండి ఎల్లూరుకు, ఏదుల నుండి బుద్దారం కాలువకు, వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువకు లింకు చేయడం జరిగింది. కాంగ్రెస్ అన్యాయాలను బీఆర్ఎస్ హయాంలో సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఈ రోజు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్యాకేజీ 3లో ఉన్న మట్టిని తొలగించి నీరు పారనివ్వండి. ఇప్పుడున్న పంపులు నడవడానికి ఏ ఇబ్బంది లేదు.. పది పంపులు నడిస్తే ఇబ్బందులు వస్తాయి.

ఏదుల, వట్టెంలో పంపులు సిద్దంగా ఉన్నాయి.. కరివెన వరకు నీళ్ళు తీసుకు వెళ్లొచ్చు. ప్రతి రిజర్వాయర్‌లో అయిదు టీఎంసీల నీటిని నింపే అవకాశం ఉంది. మిగిలిన పనులు వచ్చే ఏడాది పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్యాకేజీ 3లో అడ్డంకిగా ఉన్న మట్టి తొలగిస్తే నీళ్లు పారడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మూడేళ్ల నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన కాలువల టెండర్లను రద్దు చేసింది ఎందుకు? 

మూడేళ్ల నుండి కాలువలకు తిరిగి ఎందుకు టెండర్లు పిలవలేదు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపుతున్నది ఎవరు? తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను తెలంగాణ సాగునీటి సలహాదారులుగా నియమించుకున్నారు ఎందుకోసం? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని గత మూడేళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ కోరుతున్నా జూపల్లి కృష్ణారావు ఎందుకు ఒక్కసారి కూడా నోరు తెరిచి అడగలేదు?

జూపల్లి కృష్ణారావుకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు తప్ప పాలమూరు ప్రజల ప్రయోజనాలు పట్టవు. మాకు అధికారం ఉన్నా, లేకపోయినా పాలమూరు ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడినం, పోరాడుతున్నాం. అధికారం శాశ్వతం కాదు, ప్రజల ప్రయోజనాలే శాశ్వతం. రాజకీయాల్లో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, కానీ ఆ అవకాశం ఇచ్చిన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తే ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ స్వీకరించి, రైతులకు ఉన్న ఇబ్బందులు తొలగించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి సహకరించాలని కోరుతున్నాను’’ అని నిరంజన్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement