సత్తెనపల్లి టీడీపీలో లొల్లి | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లి టీడీపీలో లొల్లి

Published Sat, Jun 3 2023 2:22 AM

సంబరాల్లో కన్నా లక్ష్మీనారాయణ - Sakshi

తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అటు కన్నా కూడా అయిష్టంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు సీనియర్‌ నాయకుడు కోడెల మరణానంతరం పార్టీనే నమ్ముకుని.. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న కోడెల శివరామ్‌ కన్నా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి అండగా నిలిచిన తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరామ్‌ కోడెల అభిమానులతో, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు తన అనుచరులతో సమాలోచనల్లో మునిగిపోయారు.

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ చేరినప్పటి నుంచి తగిన స్థానం ఇవ్వలేదని ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. మూడు నెలల తర్వాత సత్తెనపల్లి నియోజకర్గ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో రానున్న ఎన్నికల్లో కన్నా పోటీ చేసేది సత్తెనపల్లి నియోజకవర్గం నుంచే అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు అసాధ్యమని, సొంత పార్టీ నుంచే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. దీనికి బలం చేకూరుస్తూ .. కన్నాను సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా ప్రకటించి ఒక్క రోజు కూడా గడవక ముందే .. అక్కడ టీడీపీ ప్రధాన నేతగా ఉన్న కోడెల శివరాం తన అసంతృప్తిని బాహాటంగా ప్రకటించారు.

మూడేళ్లలో ఐదు నిమిషాల టైం ఇవ్వలేదు...

పల్నాడు రాజకీయాలను కనుసన్నలతో శాసించిన తమ తండ్రి కోడెల శివప్రసాద్‌ దూరమైన దు:ఖంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడ్డామని, ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇన్‌చార్జిగా అవకాశం ఇచ్చారని కోడెల శివరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా మాట్లాడటానికి అమ్మ, నేను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నామని, కానీ అవకాశం ఇవ్వ లేదని చెప్పారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఆంజనేయులు ద్వారా కూడా తమ వేదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరినా కనికరించలేదన్నారు. కోడెల ఆశయాల కోసం, ఆయన అనుచరుల కోసం ఇక్కడే ఉంటానని, రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచి తీరుతానని శివరామ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తమ అనుచరులతో ఆయన అనేక దఫాలు సమాలోచనలు నిర్వహించారు.

వైవీ మౌనం..మన్నెం ఓకే

కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు మౌనం దాల్చారు. ఆయన ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇదే క్రమంలో కన్నా అనుచరులు పార్టీ కార్యాలయాల్లో సంబరాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సైతం వైవీ ఆంజనేయులు దూరంగా ఉన్నారు. ప్రస్తుత పరిణామాలపై అంతర్గతంగా తమ శ్రేణులతో సమాలోచనలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన మరో నేత మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి) పార్టీ అధిష్టానం నిర్ణయానికి జై కొట్టారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించి మౌనందాల్చారు.

కన్నాకు సంకటం....

సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా నియమించినందుకు సంతోషపడాలో.. వచ్చీ రాగానే అసమ్మతి సెగ రగిలినందుకు వేదన పడాలో అర్థం కాక కన్నా తల పట్టుకుంటున్నారని కొందరు నేతలు అంటున్నారు. మరో వైపు ఎవరైనా పార్టీకి కంకణబద్ధులుగా ఉండాలని, కావున కన్నా వెనుక ఉండి నడవాలని అంటున్నారు. మరి టీడీపీలో నెలకొన్న ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.

కన్నా రాకతో భగ్గుమన్న శివరామ్‌

ఇదెక్కడి న్యాయమంటూ మండిపాటు

అజ్ఞాతంలోకి వైవీ ఆంజనేయులు వర్గం

పార్టీ అధిష్టానం మాటకే మన్నెం ఓటు

అభిమానులతో సమాలోచనల్లో కోడెల శివరామ్‌
1/1

అభిమానులతో సమాలోచనల్లో కోడెల శివరామ్‌

Advertisement
Advertisement