జీడీఎస్‌ల నిరవధిక సమ్మె | Sakshi
Sakshi News home page

జీడీఎస్‌ల నిరవధిక సమ్మె

Published Sat, Dec 16 2023 12:48 AM

నిజామాబాద్‌లో సమ్మె చేస్తున్న జీడీఎస్‌లు  - Sakshi

నిజామాబాద్‌ సిటీ: గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌)లు తమ డిమాండ్ల సాధనకు చేపట్టిన నిరవధిక సమ్మెతో ఉత్తరాల బట్వాడా నిలిచిపోయింది. ఈ నెల 12 నుంచి జీడీఎస్‌లు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలో పాల్గొనటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేరవలసిన ఉత్తరాలు, పార్సిళ్లు సబ్‌ పోస్టాఫీస్‌ కార్యాలయాలల్లో పేరుకుపోతున్నాయి. వాస్తవానికి జీడీఎస్‌లు నాలుగు గంటలపాటు పని చేయవలసి ఉండగా, 7 నుంచి 8 గంటల వరకు తమతో పని చేయించుకుంటున్నారని వాపోతున్నారు. అందుకే తమకు రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇచ్చినట్లు వెయిటేజీ, ఇంక్రిమెంట్స్‌, సీనియర్‌ బంచింగ్‌లు ఇవ్వాలని, 12, 24, 36 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసిన వారికి ఆర్థిక ఉన్నతి కల్పించాలని కోరుతున్నారు.

జిల్లాలో మొత్తం 415 బ్రాంచ్‌ పోస్టాఫీస్‌లు ఉండగా, వీటిలో 750 మంది గ్రామీణ డాక్‌ సేవక్‌లు పనిచేస్తున్నారు. వీరిని పార్టుటైం ఉద్యోగులుగా తీసుకుని పూర్తిస్థాయిలో పనులు చేయిస్తున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న జీతం రూ.10 నుంచి రూ.12 వేలు, టీఏ, డీఏలు కలుపుకుని మొత్తం రూ. 16 నుంచి 18వేల వరకు అందుతోంది. 8 గంటలు పని కల్పించి అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

నాలుగో రోజుకు చేరిన సమ్మె

జీడీఎస్‌ల నిరవధిక సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. జీడీఎస్‌ నిజామాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు గంగారాం ఆధ్వర్యంలో హెడ్‌ పోస్టాఫీస్‌ ఎదుట జీడీఎస్‌లు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో డివిజన్‌ కార్యదర్శి యేగేశ్వర్‌, జీడీఎస్‌లు గంగాధర్‌, నర్సయ్య, అశోక్‌, అల్లర్‌ రాజు, అయూబ్‌, ఖలీల్‌, కార్తీక్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నిలిచిన ఉత్తరాల బట్వాడా

Advertisement
Advertisement