భారత్‌తో కలిసి పని చేయండి  | India-Poland bilateral relationship was elevated to a Strategic Partnership | Sakshi
Sakshi News home page

భారత్‌తో కలిసి పని చేయండి 

Oct 23 2026 1:54 AM | Updated on Oct 23 2026 1:54 AM

India-Poland bilateral relationship was elevated to a Strategic Partnership

పోలాండ్‌ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం  

పోలాండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ తో భేటీ 

కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయం 

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అస్థిరత, భౌగోళిక రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో రక్షణ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, పోలాండ్‌ నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, పోలాండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ అంగీకారానికి వచ్చారు. ఇరువురు నేతలు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. 

భారత్, పోలాండ్‌ సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. డొనాల్డ్‌ టస్క్‌ తో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలనను తమ రెండు దేశాలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌తోపాటు పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు జరిగే ప్రతి ప్రయత్నానికీ మద్దతు ఇస్తున్నామని తెలియజేశారు. 

భారత్, పోలాండ్‌ మధ్య రక్షణ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసు కోవాలని నిర్ణయించామని చెప్పారు. ఆయా వ్యూహాత్మక రంగాలన్నింటిలోనూ భారత్‌తో కలిసి పనిచేయాలని, అభివృద్ధి, ఉత్పత్తిలో పాలుపంచుకోవాలని పోలాండ్‌ కంపెనీలను మోదీ ఆహ్వానించారు. కీలక ఖనిజాలు, బొగ్గుతో సహజ వాయువు ఉత్పత్తిలో పోలాండ్‌ నైపణ్యాన్ని ఉపయోగించుకుంటామని వివరించారు.  

భాగస్వామ్యానికి కొత్త అవకాశాలు  
భారత్, పోలాండ్‌ దేశాల మధ్య స్నేహం కేవలం దౌత్య సంబంధాలపైనే కాకుండా.. మానవత్వం, కరుణ అనే ఉమ్మడి వారసత్వంపై ఆధారపడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జామ్‌నగర్, కొల్హాపూర్‌ రాజ కుటుంబాలు వేలాది మంది పోలాండ్‌ పిల్లలకు, కుటుంబాలకు భారతదేశంలో ఆశ్రయం కల్పించాయని గుర్తుచేశారు. 

2022లో ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి పోలాండ్‌ సహకారం అందించిందని అన్నారు. మానవతా స్ఫూర్తిని చాటుకుందని కొనియాడారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాల గురించి మోదీ ప్రస్తావించారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితిని ఎదుర్కొంటోందని చెప్పారు. 

ఇలాంటి సమయంలో కూడా భారత్, పోలాండ్‌ దేశాలు వృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలకు ముఖ్యమైన కేంద్రాలుగా ఎదుగుతున్నాయని హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక బలం నానాటికీ పెరుగుతోందని వెల్లడించారు. తద్వారా భారత్‌–పోలాండ్‌ భాగస్వామ్యానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలియజేశారు. భారత్‌–యూరోపియన్‌ యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ అవకాశాలను మరింత విస్తరించిందని పేర్కొన్నారు. 

ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం నుంచి పోలాండ్‌కు ఎగుమతులు భారీగా పెరుగుతాయని మోదీ స్పష్టంచేశారు. రైల్వేలు, రవాణా, తయారీ, ఆహార శుద్ధి, బయోటెక్‌ వంటి రంగాల్లో పోలాండ్‌ నుంచి కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు. ప్రపంచం కోసం సప్లై చైన్లను అభివృద్ధి చేయడానికి, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి భారత్, పోలాండ్‌ కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement