కుట్ర కాకపోతే మరేమిటి? | Dipke accuses Modi and Shah of waging war against own countrymen to protect Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

కుట్ర కాకపోతే మరేమిటి?

Oct 16 2026 3:28 AM | Updated on Oct 16 2026 3:28 AM

Dipke accuses Modi and Shah of waging war against own countrymen to protect Gyanesh Kumar

గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న నేహా బోరా, దీప్కే

13 కోట్ల ఓట్లను తొలగించడం వెనుక మర్మం ఏమిటి?  

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను మోదీ, అమిత్‌ షాలు ఎందుకు కాపాడుతున్నారు?  

ఎన్నికల్లో మోదీ గెలవడానికి జ్ఞానేశ్‌ కుమారే కారణమని ఎందుకు అనుకోకూడదు?  

ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకే ఎస్‌ఐఆర్‌ పేరిట కుతంత్రాలు  

కేంద్ర ప్రభుత్వంపై సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ఆగ్రహం  

ఓటు హక్కును కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము

నేడు ‘లెహ్రా దో తిరంగా’లో పాల్గొనాలని ప్రజలకు పిలుపు  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రభుత్వం కుతంత్రాలు సాగిస్తోందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మండిపడ్డారు. 13 కోట్లకుపైగా ఓటర్ల పేర్లను తొలగించడం కుట్ర కాదా? అని నిలదీశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. సొంత పౌరులపైనే కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. 

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో జరిగిన భారీ అవకతవకలకు సీఈసీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఢిల్లీలో పలువురు సామాజిక కార్యకర్తలతో కలిసి దీప్కే మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఈసీ చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 10న నిరసన పిలుపు ఇచ్చినప్పుడు ఢిల్లీలో రైల్వే, మెట్రో సేవలను నిలిపివేశారని, నగర సరిహద్దులలో ఉద్రిక్తత వాతావరణం సృష్టించారని ఆక్షేపించారు. మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ప్రతిపక్ష నాయకులను కూడా నిర్బంధించారని ఆక్షేపించారు.

జంతర్‌మంతర్‌లో జాతీయ జెండాను ప్రదర్శించినందుకే తమ పార్టీ నేతలు అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌లను అరెస్టు చేసి, తీహార్‌ జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువత, ప్రతిపక్ష నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపడాన్ని ఖండించారు.  
దేశమంతా జంతర్‌మంతర్‌గా మారాలి: ప్రకాశ్‌రాజ్‌  
ఫారం–7ను దుర్వినియోగం చేస్తూ ఓ వర్గం ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సుమారు 200 సంస్థలు ఏకమయ్యాయని చెప్పారు. నిరసన వేదికగా ఉన్న జంతర్‌మంతర్‌ను లేకుండా చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అందుకే దేశమంతా జంతర్‌మంతర్‌గా మారాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం దేశ యువతకు చెందినదని వివరించారు. ప్రతి జిల్లా, ప్రతి వీధి ఒక నిరసన వేదికగా మారడం తథ్యమని తేల్చిచెప్పారు.  

ప్రభుత్వ మార్పు కోసం ఉద్యమించాలి: ప్రశాంత్‌ భూషణ్‌  
దేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఓటర్ల జాబితా నుంచి అకారణంగా పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, చట్టవిరుద్ధంగా ముందస్తుగా నిర్బంధించడం సరైంది కాదన్నారు. జంతర్‌ మంతర్‌లో నిరసనలను నిషేధించడాన్ని తప్పుబట్టారు. దేశంలో ప్రభుత్వ మార్పు కోసం ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

బంద్‌ కరో  
మీడియా సమావేశంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. నేహా బోరా మాట్లాడుతున్న సమయంలో కొందరు ‘బంద్‌ కరో, దఫా హో జావో’(ఆపేసి, బయటకు వెళ్లిపోండి) అని గట్టిగా అరిచారు. వారిని బయటకు పంపించాలని మీడియా ప్రతినిధులను నేహా బోరా కోరారు.  

మోదీకి జ్ఞానేశ్‌ ఎందుకంత ముఖ్యం: దీప్కే
‘‘జ్ఞానేశ్‌ కుమార్‌ వల్ల మోదీకి లాభం ఏమిటి? ఆయన కోసం మొత్తం ఢిల్లీనే స్తంభింపజేశారు. మోదీకి జ్ఞానేశ్‌ కుమార్‌ ఎందుకంత ముఖ్యమైన వ్యక్తి అయ్యారు? ఎన్నికల్లో మోదీ గెలవడానికి జ్ఞానేశ్‌ కుమారే కారణమని మనం ఎందుకు అనుకోకూడదు? 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార, విపక్ష కూటముల మధ్య ఓట్ల అంతరం కేవలం 2 శాతం మాత్రమే. 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారు. అంటే సుమారు 14 శాతం ఓట్లు పోయాయి. 

ఎన్నికల ఫలితాన్ని కేవలం 2 శాతం ఓట్లు నిర్ణయిస్తున్న తరుణంలో 13 కోట్ల ఓట్లను తొలగించడం వెనుక మర్మం ఏమిటి? దీన్ని ముందస్తు కుమ్మక్కు, కుట్ర కాకపోతే మరేమనాలి? ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే నినాదం వెనుక మరో లక్ష్యం ఉంది. ఒకే దేశం–ఒకే పార్టీ–ఒకే నాయకుడు అనేదే బీజేపీ విధానం. గాం«దీజీ, నెహ్రూల కంటే మోదీ ఎప్పటికీ గొప్పవారు కాలేరు’’అని అభిజీత్‌ దీప్కే తేల్చిచెప్పారు. 

శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో సీజేపీ నిర్వహించనున్న లెహ్రా దో తిరంగా(త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి) ర్యాలీలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీ లను, పౌర సంఘాలను, ప్రజలను కోరారు. భావజాలాలకు అతీతంగా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోలేమని స్పష్టంచేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని, తమ పార్టీ నేతలు అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌లతో పాటు నిర్బంధించిన నిరసనకారులందరినీ వెంటనే విడుదల చేయాలని, నిరసనకారులపై పోలీసు వేధింపులను నిలిపేయాలని, జంతర్‌ మంతర్‌ను తిరిగి నిరసన వేదికగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.  

ప్రజలందరి ఉమ్మడి ఉద్యమం: నేహా బోరా  
ఢిల్లీలో నిరసనలను కవర్‌ చేస్తున్న పాత్రికేయులను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని, ప్రెస్‌ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని, కెమెరాలను లాగేసుకున్నారని ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఆరోపించారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడటానికి బదులుగా ప్రజలపైనే విరుచుకుపడుతున్నారని ధ్వజమెత్తారు. 

జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమం, ఓటు హక్కు పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికో, రాజకీయ పార్టీకో లేదా ఏదైనా జెండాకో పరిమితమైనది కాదని అన్నారు. ఇది ప్రజలందరి ఉమ్మడి ఉద్యమమని స్పష్టంచేశారు. ఓటు హక్కును కాపాడాలని కోరితే జైలుకు పంపుతున్నారని నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలను ఈడ్చుకెళ్లడం అంటే ఓటు హక్కు కోల్పోయిన 13 కోట్ల మందిని ఈడ్చుకెళ్లడమేనని తేల్చిచెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement