ఢిల్లీ ధర్నాలో వాళ్ల ముసుగులో వీళ్లు అమ్మాయిలపై దాడులు | Delhi Police Arrest Four Men From Hindu Raksha Dal For Allegedly Assaulting Women And Students During CJP Protest | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ధర్నాలో వాళ్ల ముసుగులో వీళ్లు అమ్మాయిలపై దాడులు

Oct 11 2026 7:25 PM | Updated on Oct 11 2026 7:41 PM

4 Men Claiming To Be From Hindu Raksha Dal Arrested

న్యూఢిల్లీ: అక్టోబర్ 10న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలో అమ్మాయిలు, మహిళలు, ఇతర విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాము హిందూ రక్షా దళ్‌కు చెందినవారమని చెప్పుకున్న ఈ వ్యక్తులు.. ఆ ముసుగులో డీడీయూ మార్గ్‌లో నిరసనకారులను కొట్టడం, మహిళలను తోసివేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అరెస్టయిన వారిని రమణ్ సైనీ (50), వివేకానంద్ అలియాస్ వివేక్ (32), కపిల్ కుమార్ (27), రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూ (35)గా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీయూ మార్గ్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు యువ విద్యార్థులపై దాడి చేయడం, మహిళలను బలవంతంగా తోసివేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఓ పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

నిరసన మొదటి రోజున విద్యార్థులు దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో గుమిగూడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోని గ్రూపుల్లో చక్కర్లు కొట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, తొలుత ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించలేకపోయారు. నిరసన నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు చేపట్టిన సమయంలో సిబ్బంది ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే అణచివేత: సౌరవ్ దాస్

 అధికారిక ఫిర్యాదు అంద​​‍కపోయినా.. 
ఈ ఘటనపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ, వీడియో తమ దృష్టికి రావడం, నిందితులు ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు స్వయంగా కేసును పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టారు. నలుగురిని గుర్తించి అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి వెల్లడించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా సీజేపీ నిరసన చేపట్టింది. ఈ ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో పలుచోట్ల నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలాది మందిని నిర్బంధించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత యువజన కాంగ్రెస్, అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ), సీజేపీకి సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతాలు కూడా పంచుకున్నాయి. దాడి ఘటనపై తదుపరి పోలీసు చర్యలు, నిరసనల సమయంలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై విచారణ ఎలా సాగుతుందన్నది కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement