నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక

Published Fri, Apr 19 2024 1:35 AM

ముస్తాబవుతున్న సభా వేదిక  - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధి లోని ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ ఉదయం నామినేషన్‌ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్‌ పట్టణ ంలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారు. కాగా మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్‌ అధికారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్‌ను పరిశీలించారు.

సవాల్‌గా జనసమీకరణ..

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో బహిరంగ సభకు జనసమీకరణ సవాల్‌గా మారింది. అయితే కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం భారీ ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌, నర్సంపేట, ఇల్లెందు నియోజకవర్గాల నుంచి జనాలను తరలించే బాధ్యత ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు అప్పగించారు. లక్ష మందిని తరలించాలని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నాయకులు, ప్రజాప్రతినిధులకు టార్గెట్‌ పెట్టారు. అయితే గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని పలువురు నాయకులు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జనాన్ని తరలించడం, వారికి తాగునీరు, మజ్జిగ, పెరుగన్నం మొదలైనవి సమకూర్చుకొనిసభకు రావాల్సి ఉంటుంది. అయి తే ‘అసెంబ్లీ ఎన్నికల్లో అప్పులు తెచ్చి ఖర్చుపెట్టాం.. ఇప్పుడు బలరాంనాయక్‌ ఎన్నిక మా చావుకు వచ్చింది.. పార్టీ ఆదేశాలు కఠినంగా ఉన్నా యి.. ఆర్థిక వనరులు మాత్రం లేవు అని’ ఓ ప్రజాప్రతి నిధి తమ అనుచరులతో వాపోయినట్లు ప్రచారం.

ఉదయం నామినేషన్‌.. సాయంత్రం సభ..

కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం ఉదయం జరిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు, ప్రతి మండలం నుంచి కీలక నాయకులు హాజరుకావాలని ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. అయితే సాయంత్రం సీఎం సభకు జనసమీకరణ బాధ్యత ఉండటంతో ఉదయం వచ్చి మహబూబాబాద్‌లోనే ఉంటే జనాన్ని తరలించడం ఇబ్బందిగా ఉంటుందని, సాయంత్రం నేరుగా జనంతో సభకే వస్తామని పలువురు నాయకులు అంటున్నారు.

బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన..

మహబూబాబాద్‌ రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని సభాస్థలి, హెలిపాడ్‌, పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహబూబాబాద్‌ జిల్లాతోపాటుగా జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఐఎస్‌డబ్ల్యూ అధికారి వాసుదేవరెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ భాస్కర్‌, డీఎస్పీ జితేందర్‌ రెడ్డి ప్రత్యేకంగా వచ్చి సభాస్థలి, హెలిపాడ్‌ ప్రాంతాలను ఎస్పీతో కలిసి పరిశీలించారు. ట్రైనీ ఐపీఎస్‌ చేతన్‌ పండరీ, అడిషనల్‌ ఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ తిరుపతిరావు, టౌన్‌ సీఐ దేవేందర్‌ ఉన్నారు.

ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగం

భారీ జనసమీకరణకు కసరత్తు

హెలిపాడ్‌ను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మురళీనాయక్‌, అభ్యర్థి బలరాంనాయక్‌
1/1

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మురళీనాయక్‌, అభ్యర్థి బలరాంనాయక్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement