ఉగ్రం టీజర్‌ అదిరిపోయింది  | Ugram teaser released | Sakshi
Sakshi News home page

ఉగ్రం టీజర్‌ అదిరిపోయింది 

Feb 23 2023 2:11 AM | Updated on Feb 23 2023 2:11 AM

Ugram teaser released - Sakshi

‘‘ఉగ్రం’ సినిమా టీజర్‌ అదిరిపోయింది.. నెక్ట్స్‌ లెవల్‌లో ఉందనిపించింది. ‘నాంది’ తర్వాత నరేష్‌ మళ్లీ అలాంటి ఇంటెన్స్‌ రోల్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో నాగచైతన్య అన్నారు. ‘నాంది’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హీరో ‘అల్లరి’ నరేష్, డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని నాగచైతన్య రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘నరేష్ , విజయ్‌ కాంబినేషన్‌ ఒక బ్రాండ్‌లా ఉంది.

సాహు, హరీష్‌ అద్భుతమైన నిర్మాతలు. నా కెరీర్‌లో ‘మజిలీ’ వంటి మంచి సినిమా ఇచ్చారు వారు. ఆ సినిమాలా ‘ఉగ్రం’ బ్లాక్‌ బస్టర్‌ కావాలి’’ అన్నారు. నరేష్‌ మాట్లాడుతూ– ‘‘ఒక నటుణ్ణి దర్శకుడు ఎంత నమ్మితే అన్ని మంచి విజయాలు వస్తాయి. మా నాన్నగారు (ఈవీవీ సత్యనారాయణ) నన్ను నమ్మినప్పుడు వరుస విజయాలు వచ్చాయి. క్రిష్‌గారు నన్ను నమ్మినప్పుడు ‘గమ్యం’, సముద్రఖని నమ్మినప్పుడు ‘శంభో శివ శంభో’ వంటి మంచి సినిమాలు వచ్చాయి.

ఆ తర్వాత ‘నాంది’తో విజయ్‌ నాకు కొత్త రూటు చూపించారు’’ అన్నారు. ‘‘నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంత గొప్పగా  ఆదరిస్తారో ‘నాంది’ విజయం చూపించింది.. ‘ఉగ్రం’ కూడా అంతే నిజాయితీగా ఉంటుంది’’ అన్నారు విజయ్‌ కనకమేడల.
 

Advertisement
 
Advertisement
Advertisement