'టూరిస్ట్‌ ఫ్యామిలీ' తర్వాత యంగ్‌ హీరోయిన్‌తో మూవీ ప్లాన్‌ చేసిన శశికుమార్‌ | Sasikumar And Aparna das Movie Plan | Sakshi
Sakshi News home page

'టూరిస్ట్‌ ఫ్యామిలీ' తర్వాత యంగ్‌ హీరోయిన్‌తో మూవీ ప్లాన్‌ చేసిన శశికుమార్‌

Jun 10 2025 7:04 AM | Updated on Jun 10 2025 9:20 AM

Sasikumar And Aparna das Movie Plan

వైవిధ్య కథాచిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న 'శశికుమార్‌' వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన 'అయోద్ధి' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్‌' చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శశికుమార్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల నటి సిమ్రాన్‌తో కలిసి నటించిన 'టూరిస్ట్‌ ఫ్యామిలీ' మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం శశికుమార్‌ హీరోగా నటించిన ఫ్రీడమ్‌ చిత్రం జూలై 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈయన తొలిసారిగా వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. 

ఇంతకు ముందు రూపొందిన వదంతి వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వదంతి–2 రూపొందుతోంది. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇతి వృత్తంతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో నటుడు శశికుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ మదురై, తిరునల్వేల్లి ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ వెబ్‌ సిరీస్‌లో తాను శశికుమార్‌కు జంటగా నటిస్తున్నట్లు నటి 'అపర్ణదాస్‌'(Aparna Das) ఇటీవల ఒక భేటీలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల బ్యూటీ 50 ఏళ్లకు పైగానే ఉన్న శశికుమార్‌కు జంటగా నటించనుంది. 

ఆమె  ఇప్పటికే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించారన్నది గమనార్హం. ముఖ్యంగా తమిళంలో నటుడు విజయ్‌ హీరోగా నటించిన బీస్ట్‌ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ నాలుగైదు చిత్రాల్లో నటించారు. తమిళంలో ఆమె నటించి 'దాదా' (పాపా) సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడా చిత్రం తెలుగులో జూన్‌ 12న విడుదల కానుంది.

కాగా దీని తరువాత శశికుమార్‌ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. చాలా గ్యాప్‌ తరువాత ఈయన మెగాఫోన్‌ పట్టి శ్రీకుట్రపరంపరైశ్రీ అనే వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయకాంత్‌ వారసుడు షణ్ముఖ పాండియన్‌ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని శశికుమార్‌నే ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement