సినిమా లవర్స్‌కి దసరా పండగ చాలా అప్‌డేట్స్ ఇచ్చింది. కొత్త పోస్టర్లు వచ్చాయి... పాటలు విడుదలయ్యాయి... పేర్లు షురూ చేసుకున్నాయి... రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇలా ‘పండగే పండగ’ అన్నమాట. ఇక ఆ అప్‌డేట్స్ గురించి తెలుసుకుందాం.
పాటొచ్చింది
→ శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించిన చిత్రం ‘రామాయణ’ (తెలుగులో ‘రామాయణం’). నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మించారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ పార్ట్ 1’ నవంబరు 5న విడుదలవుతోంది. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, హిందీ మార్కెట్‌లో ధర్మ ప్రొడక్షన్స్ పంపిణీ చేస్తోంది. ఈ మూవీని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ‘రామాయణం’లో రావణుడిగా యశ్ నటించారు. దసరాను పురస్కరించుకుని రావణుడిగా యశ్ కనిపించే ప్రత్యేక వీడియోను విడుదల చేశారు మేకర్స్. హిందీలో ‘రైజ్ ఆఫ్ అసుర’, కన్నడలో ‘రావణ తాండవ’, తమిళ, తెలుగులో ‘రావణ తాండవం’ పేర్లతో ఈ వీడియోను రూపొందించారు. తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు.
→ శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘అన్నయ్య పానం...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఐదుగురు చెల్లెళ్లపై ఒక అన్నయ్య చూపించే ప్రేమ, ఆ΄్యాయతలను హృద్యంగా ఆవిష్కరించే ఈ పాటలో శర్వానంద్, అనుపమ ప్రేమకథకు సంబంధించిన కొన్ని అందమైన క్షణాలను కూడా చూపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీకృష్ణ పాడారు.
డేట్‌ఫిక్స్
→ ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ తన కుటుంబంతో కలిసి ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో వెంకటేశ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జంటగా నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’!. ఈ నెల 30 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మధ్యతరగతి కుటుంబ జీవితంలోని సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాలు, చమత్కారాలు, నవ్వులు... వీటికి అదనంగా యాక్షన్‌ని జోడించి, ఈ చిత్రాన్ని రూపొందించారు. మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
2 సంగీతదర్శకుడిగా ‘రాకింగ్ స్టార్’ అనిపించుకున్న దేవిశ్రీ ప్రసాద్ సిల్కర్ స్క్రీన్‌పై రాక్ చేయడానికి రెడీ అయిన చిత్రం ‘ఎల్లమ్మ’. దేవిశ్రీ ప్రసాద్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్ రాజు’ సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ‘ఎల్లమ్మ’ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘పర్షి’ అనే పాత్రలో దేవిశ్రీ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ, సంగీతం అందిస్తున్నారు.
కొత్త పోస్టర్‌గురూ
→ నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కానుంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌లో చేస్తున్న సాహసోపేతమైన పాత్రకు తగినట్లుగా చైతన్య కొత్త లుక్‌లోకి మారారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
→ లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. దుర్గ ఫణిదర్ లంక దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వాణి శంకర్, తిలోత్తమ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను నిర్మాతలు అశ్వనీదత్ , స్వప్న దత్ రిలీజ్ చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ పోస్టర్‌లో అమ్మవారిగా లయ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ‘‘ఈ చిత్రకథ, కథనాలు, విజువల్స్, యాక్షన్.. అన్నీ హైలెట్‌గా ఉంటాయి. అమ్మవారిగా లయ కనిపించే సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది.
→ కన్నడ నటుడు భార్గవ్ హీరోగా, దర్శకుడిగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’. ఇందులో ఆరియా మీనన్ కథానాయిక. బండి నాగరాజు నిర్మిస్తుండగా, మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ సినిమా పోస్టర్‌ని లాంచ్ చేసి, ‘‘ఈ సినిమా ఆటంకాలు లేకుండా పూర్తయి, ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం సాధించాలి’’ అన్నారు.
పేరుషురూ
→ ఆది సాయికుమార్ హీరోగా నవరసన్ దర్శకత్వంలో ప్రశాంత్ జి. రుద్రప్ప నిర్మిస్తున్న చిత్రానికి ‘ఆది రుద్ర’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘‘దైవిక, అతీంద్రియ రహస్యాలు, ఉత్కంఠభరితమైన సస్పెన్స్ కలగలిసిన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. 1960ల నుంచి 1990ల మధ్య కాలంలో ఈ కథ జరుగుతుంది. దైవత్వం, విశ్వాసం, ఆధ్యాత్మికత, అంతుచిక్కని రహస్యాలు, భావోద్వేగాల చుట్టూ సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది. ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ ‘ఆది రుద్ర’ ఆది సాయికుమార్ కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా నిలిచిపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు.
→ సుమంత్ ప్రభాస్ హీరోగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘బబ్లూ డబుల్ ఎక్స్‌ఎల్’ టైటిల్ ఖరారైంది. గహజీ ఎస్‌కే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో మంచిర్యాల పట్టణం, అక్కడి ప్రసిద్ధ క్లాక్ టవర్, చారిత్రక రాతి వంతెన, ఆలయ నిర్మాణ శైలి, ఇతర స్థానిక ప్రదేశాలు కనిపిస్తున్నాయి. దాంతో మంచిర్యాల టౌన్ ఈ కథకు కీలకం అని తెలుస్తోంది. ‘‘జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని మేకర్స్ తెలిపారు.


