సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘జైలర్ 2’ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ మ్యాథ్యూ పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. అయితే ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, లుక్స్ ఫైనల్ కట్లో తొలగించడంపై కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంసుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా మూడు విభిన్నమైన లుక్స్‌ను తొలగించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మూడు లుక్స్ తొలగించారంటూ..
2023లో విడుదలైన ‘జైలర్’ సినిమాలో మోహన్‌లాల్ మ్యాథ్యూ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ షర్టులు, సన్‌గ్లాసెస్‌తో స్మగ్లర్‌గా కనిపిస్తూ రజనీకాంత్ పోషించిన టైగర్ ముత్తువేల్ పాండియన్‌కు స్నేహితుడిగా అలరించారు. ‘జైలర్ 2’లోనూ ఆయన కీలక పాత్రలో నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కనిపించే సన్నివేశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే చిత్రీకరణ సమయంలో సిద్ధం చేసిన మూడు విభిన్నమైన లుక్స్‌ను పూర్తిగా తొలగించారని జిషాద్ పేర్కొన్నారు.
మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ
ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో మోహన్‌లాల్ కోసం రూపొందించిన పలు లుక్స్‌ను పంచుకుంటూ ఓ నోట్ రాశారు. ‘ చిత్రీకరించిన సన్నివేశాలను చూసినప్పుడు పనిపై ఎంతో నమ్మకం కలిగింది. ట్రైలర్లో కేవలం రెండు సెకన్ల పాటు మాత్రమే కనిపించినప్పటికీ నా నమ్మకాన్ని కొల్పోలేదు. అయితే సినిమా విడుదలయ్యాక మూడు లుక్స్‌తో పాటు ట్రైలర్లో చూపించిన సన్నివేశాన్ని కూడా కుదించారు. సినిమా పరిశ్రమలో డబ్బు సంపాదించేందుకు, కోట్ల వసూళ్లు, స్టార్డమ్ కోసం నేను పనిచేయడం లేదు. అభిమానులు, కళను ప్రేమించేవారు, మోహన్‌లాల్ కోసమే పని చేస్తున్నాను. ఒకవేళ జైలర్3 తెరకెక్కితే ఇందులో భాగం కాను. ఈ ప్రయాణంలో మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: ‘జైలర్2’కు పైరసీ భూతం.. ఆన్లైన్లో HD ప్రింట్)


