30 రోజుల్లో 20 సినిమాలు.. విజేతలెవరో! | List Of Releasing New Movies In November 2026 | Sakshi
Sakshi News home page

30 రోజుల్లో 20 సినిమాలు.. బాక్సాఫీస్‌ బరిలో స్టార్‌ హీరోలు!

Oct 25 2026 3:42 PM | Updated on Oct 25 2026 4:16 PM

List Of Releasing New Movies In November 2026

నవంబరులో రానున్న 20కి పైగా సినిమాలు  

మరో వారంలో అక్టోబరు నెల పూర్తవుతోంది. నవంబరు నెల ఆరంభం కానుంది. ఈ నెలలో దాదాపు 20 సినిమాలకు పైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంటే... ‘సినిమా మేళా’ అన్నమాట. ప్రత్యేకించి నవంబరు 6న దీపావళి పండగ సందర్భంగా ఒకే రోజు నాలుగు సినిమాలు విడుదలవుతుండటం విశేషం. నవంబరులో రిలీజ్‌ అవుతున్న సినిమాల్లో పలు తెలుగు స్ట్రయిట్‌ మూవీస్‌ ఉండగా మరికొన్ని డబ్బింగ్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో రానున్న చిత్రాల్లో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘రామాయణ పార్ట్‌ 1’ ఉంది. అలాగే సూర్య, శర్వానంద్, విశ్వక్‌ సేన్, దుల్కర్‌ సల్మాన్, ధనుష్, నయనతార, కీర్తీ సురేష్, రష్మిక మందన్నా వంటి స్టార్‌ హీరో, హీరోయిన్ల చిత్రాలతో పాటు పలువురు యువ హీరోల సినిమాలు కూడా విడుదలకు క్యూ కడుతున్నాయి. తమ క్రేజీ ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్న ఆ హీరోలు, హీరోయిన్లు ఎవరు? ఆయా సినిమాలు ఏంటి? వంటి విశేషాలు చూద్దాం... 

రామాయణం...  
శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రామాయణ’ (తెలుగులో ‘రామాయణం’). నితీష్‌ తివారీ దర్శకత్వంలో ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌పై నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్‌ నటించారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ పార్ట్‌ 1’ నవంబరు 5న విడుదలవుతోంది. 

ఈ మూవీని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన హిందీ చిత్రం ఇది. పౌరాణికం నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో, స్టార్‌ నటీనటులతో రూపొందిన ఈ మూవీ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమాపై పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వితీయ భాగం 2027  దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సీన్‌...  
‘రామాయణం’ వంటి ప్రతిష్ఠాత్మక సినిమా విడుదలైన మరుసటి రోజు 6న దీపావళి కానుకగా ‘సీన్, మహాశక్తి, సమ్మర్‌ హాలిడేస్, హతః’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పై సినిమాల్లో ముందుగా చర్చించుకోవాల్సిన చిత్రం ‘సీన్‌’. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఆవేశం’ ఫేమ్‌ డైరెక్టర్‌ జిత్తు మాధవన్‌  తెరకెక్కించారు. నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా నటించారు. జ్యోతిక, సూర్య కలిసి అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై నిర్మించిన ఈ తమిళ చిత్రానికి జయశ్రీ దామోదరన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్‌–కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం 6న విడుదల కానుంది. ఈ మూవీని ఆంధ్రప్రదేశ్‌– తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఎన్వీఆర్‌ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తోంది.  

 


ఈ నగరానికి ఏమైంది రిపీట్‌... 
విశ్వక్‌ సేన్‌ హీరోగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్‌’. ప్రియదర్శిని రామ్, అభినవ్‌ గోమఠం, వెంకటేష్‌ కాకుమాను, శ్రీనాథ్‌ మాగంటి ఇతర పాత్రల్లో నటించారు. ఎస్‌ ఒరిజినల్స్, రూట్‌నోడ్‌ సినిమా బ్యానర్లపై సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నవంబరు 13న రిలీజ్‌ అవుతోంది. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ 2018లో విడుదలై, కల్ట్‌ క్లాసిక్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీ ‘ఈఎన్‌ఈ రిపీట్‌’. తొలి భాగంలో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్‌ సేన్, అభినవ్‌ గోమఠం, వెంకటేష్‌ కాకుమాను, శ్రీనాథ్‌ మాగంటి... గ్యాంగ్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


మహాశక్తి...  
దక్షిణాదిలో లేడీ సూపర్‌ స్టార్‌గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్‌ 2’. సుందర్‌ .సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో ఇషారి కె. గణేశ్‌ నిర్మించిన ఈ చిత్రం       ‘మహాశక్తి’ పేరుతో 6న తెలుగులో విడుదల కానుంది. భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో నయనతార అమ్మవారిగా కనిపించనున్నారు. ఆమె నటించిన ‘మూకుత్తి అమ్మన్‌’ 2020 నవంబరు 14న విడుదలై, హిట్‌గా నిలిచంది. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ‘మహాశక్తి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

సమ్మర్‌ హాలిడేస్‌...  
మాస్టర్‌ రోహన్, మాస్టర్‌ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో, వాసుకి, రాజీవ్‌ కనకాల, హర్షిణి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘సమ్మర్‌ హాలిడేస్‌’. శ్రీకర్‌ దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. బాలల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 2, ఆ తర్వాత అక్టోబరు 30న విడుదల చేయాల్సి ఉండగా చివరకు నవంబరు 6న రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. పేరుకి ఇది చిన్న పిల్లల సినిమా అయినప్పటికీ పెద్దలు కూడా చూసేలా ఉంటుందని, వారికి తమ బాల్యం గుర్తొస్తుందని నిర్మాత ధీరజ్‌ మొగిలినేని తెలిపారు.  

హతః  
కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హతః’. అనుష్‌ గోరక్‌ దర్శకత్వంలో కేఏ ప్రొడక్షన్స్‌, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై కిరణ్‌ అబ్బవరం, శివశంకర నాయుడు. వై నిర్మించారు. ఈ సినిమా కూడా 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

 

గోట్‌... 
సుడిగాలి సుధీర్‌ హీరోగా, దివ్యభారతి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘జీ.ఓ.ఏ.టీ’(గోట్‌). (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌) అనేది ఉపశీర్షిక. వేదవ్యాస్‌ దర్శకత్వంలో మహాతేజ క్రియేషన్స్‌ అండ్‌ జైష్ణవ్‌ ప్రొడక్షన్స్‌పై మొగుళ్ళ చంద్రశేఖర్‌ నిర్మించారు. బ్రహ్మాజీ, నితిన్‌ ప్రసన్న ఇతర పాత్రలు పోషించారు. వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం పలుమార్లు రిలీజ్‌ వాయిదా పడి. ఫైనల్‌గా నవంబరు 12న విడుదలకానుంది.

దొంగ నా కొడుకు... 
‘లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ ఫేమ్‌ మౌళి తనూజ్‌ ప్రశాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్‌ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌ నిర్మించారు. కడుపుబ్బా నవ్వించే క్రైౖమ్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా నవంబరు 13న విడుదలవుతోంది. ‘లిటిల్‌ హార్ట్స్‌’ వంటి హిట్‌ మూవీ తర్వాత మౌళి తనూజ్‌ ప్రశాంత్‌ నటించిన ‘దొంగ నా కొడుకు’పై యువతలో క్రేజ్‌ నెలకొంది.

టాల్కమ్‌ పౌడర్‌... 
‘పెళ్ళిచూపులు’, ‘మెంటల్‌ మదిలో’, ‘చూసీ చూడంగానే’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ ప్రొడ్యూసర్‌ రాజ్‌ కందుకూరి నిర్మించిన తాజా చిత్రం ‘టాల్కమ్‌ పౌడర్‌’. శివ కందుకూరి హీరోగా, ద్రిషికా చందర్‌ కథానాయికగా నటించారు. సాయినాథ్‌ మున్నా రచన, దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో వెంకటేష్‌ మహా, జీవన్‌ కుమార్, కృష్ణ కమల్, రూ΄ా లక్ష్మి, సంజయ్‌ స్వరూప్, యోగి ఖత్రి, నాగమహేష్, శివాని మహి కీలక పాత్రలు పోషించారు. న్యూ ఏజ్‌ క్రైౖమ్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 13న విడుదల కానుంది.

∙ఆకాశంలో ఒకతార... 
దుల్కర్‌ సల్మాన్‌  హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. అలాగే హీరోయిన్‌  శ్రుతీహాసన్‌ ప్రధాన పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్‌ మీడియా బ్యానర్‌పై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ మూవీ నవంబరు 20న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతోంది. ‘‘వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన నటించిన మరో డిఫరెంట్‌ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. చక్కని కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు పవన్‌ సాధినేని. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ఈ సినిమా ప్రత్యేకమైన, గుర్తుండిపోయే ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

సత్యవాన్‌ సావిత్రి... 
హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఓ వైపు ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు  ‘రౌడీ జనార్ధన’, ‘జనవరి 12 విడుదల’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యవాన్‌ సావిత్రి’. ఈ చిత్రం ద్వారా ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు, దర్శకుడు మిస్కిన్, చారుకేష్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్, మధుసూదనన్, ఆర్‌. సుందరరాజన్, బ్రిగిడా, మాలా ΄ార్వతి, ఎ. వెంకటేష్‌ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డ్రమ్‌స్టిక్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వేదికకారన్‌పట్టి ఎస్‌. శక్తివేల్‌ నిర్మించారు. జీ స్టూడియోస్‌ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ పలుమార్లు రిలీజ్‌ వాయిదా పడి, ఫైనల్‌గా నవంబరు 20న తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్‌ అవుతోంది. కోర్ట్‌రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో లాయర్‌ పాత్ర పోషించారు కీర్తీ సురేశ్‌. 

ఓమ్‌...
ధనుష్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఓం చాప్టర్‌ 1– ఉదిరమ్‌: ది బ్లడ్‌ ఉడ్‌’. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా, మమ్ముట్టి, నసీరుద్దీన్‌ షా కీలక పాత్రలు పోషించారు. వండర్‌బార్‌ ఫిల్మ్స్‌పై ధనుష్‌ స్వయంగా నిర్మించిన ఈ సినిమా తొలుత అక్టోబరు 16న రిలీజ్‌ కావాల్సి ఉండగా రజనీకాంత్‌గారి ‘జైలర్‌–2’ సినిమా అక్టోబరు 15న విడుదల కానుండటంతో వాయిదా వేశారు ధనుష్‌. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నవంబరు 20న ప్రేక్షకులముందుకు వస్తోంది. ధనుష్‌–మమ్ముట్టి– నసీరుద్దీన్‌ షా, సాయిపల్లవి, శ్రీలీల వంటి యాక్టర్స్‌ నటించిన ఈ సినిమాపై దక్షిణాదిలో క్రేజ్‌ నెలకొంది.

మైసా... 
ఓ వైపు హీరోయిన్‌గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్స్‌తో దూసుకెళుతున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ రవీంద్రన్, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్‌ ఇతర పాత్రలు పోషించారు. అన్‌ ఫార్ములా ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ మూవీ నవంబరు 27న రిలీజ్‌ అవుతోంది. 

‘‘రష్మిక నటించిన ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా యాక్షన్‌ డ్రామా ‘మైసా’. ఈ చిత్రంలో రష్మిక గోండ్‌ గిరిజన యువతి పాత్రలో నటించారు. ఈ చిత్రం కోసం రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల పాటు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. భారతీయ సినీ చరిత్రలో ఓ కథానాయిక స్వయంగా చేసిన మొట్టమొదటి అండర్‌వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ ఇదే. ఈ సన్నివేశం సినిమాలోనే అత్యంత హైలైట్‌గా నిలవనుంది’’ అని చిత్ర
యూనిట్‌ పేర్కొంది.

హైందవ... 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా, సంయుక్త హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘హైందవ’. మహేష్‌ మంజ్రేకర్, సౌరభ్‌ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్‌ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో శివెన్‌ రామకృష్ణ సమర్పణలో మూవీ షైన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ చందు నిర్మించారు. ఈ సినిమా నవంబరు 27న రిలీజ్‌ కానుంది. ‘‘దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ ‘హైందవ’. విగ్రహాలకు, ఒక ΄ోలీస్‌ ఆఫీసర్‌కు మధ్య ఎలాంటి కథ జరుగుతుందనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ కోసం నటీనటులు బెస్ట్‌ ఎఫర్ట్స్‌ పెట్టారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన, గొప్ప అనుభూతినిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  
పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా నవంబరు నెలలోనే ప్రేక్షకులముందుకు వచ్చేందుకు వరుసలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement