
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్‌పై 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్‌లో బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. బర్త్ డే కేక్ విషయమై ప్రిజం పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కల్పికపై వారు కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే.
గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్‌మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన చెందింది. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్లు ఆమె పేర్కొంది. గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది.
