ఓటీటీ ఇది చూడొచ్చు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘బేబీ డూ డై డూ’ ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సినిమా అంటేనే లాజిక్కు లేని మాజిక్కు. పైగా ఆ మాజిక్కుకు ఎమోషన్ జోడిస్తే ఇక అది ఊహకందని క్రియేటివిటీ అవుతుంది. అదే క్రియేటివిటీని టైటిల్ కార్డు నుండి శుభం కార్డు వరకు చూడాలనుకుంటే ఈ సినిమానే చూడాలి. అదే ‘బేబీ డూ డై డూ’. ఈ సినిమా ఆలోచనే సామాన్య ప్రేక్షకులకు ఔరా అనిపిస్తుంది. అంతేకాదు... ఈ సినిమా ఓ సాహసమనే చెప్పాలి. బాలీవుడ్ దర్శకుడు నచికేత్ సామంత్ మంచి హోం వర్క్‌తో లాజిక్కు లేని మాజిక్కుని ప్రేక్షకులు నమ్మేట్టే చేశారు.
ఈ సినిమా ప్రధాన పాత్రలో హ్యుమా ఖురేషి అద్భుతంగా నటించి, మెప్పించారు. మరి... ఈ ‘బేబీ డూ డై డూ’ సినిమా కథ ఏంటంటే... ఓ పేద కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆడుకుంటూ ఓ పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయికి వినబడదు, మాట్లాడలేదు. అలా ఆ బంగళా లోపలికి వెళ్ళిన ఆ పిల్లలు ఓ ముసుగు వ్యక్తిని చూస్తారు. ఆ ముసుగు వ్యక్తి మరో వ్యక్తిని చంపుతూ ఉంటాడు.
ఇంతలో ఈ పిల్లలు చేసిన అలికిడి వల్ల వీళ్ళిద్దరినీ వెంబడిస్తాడు. ఆ సమయంలో ఇద్దరిలో అన్నీ బావున్న అమ్మాయి ఆ ముసుగు వ్యక్తికి చిక్కుతుంది. అతను ఆ అమ్మాయిని చంపేస్తాడు. మూగ, చెవుడు ఉన్న అమ్మాయి మాత్రం తప్పించుకుంటుంది. ఆ పాప పేరే బేబీ. తాను తప్పించుకునే ముందు బేబీ తన సోదరిని ఆ ముసుగు వ్యక్తి చంపడాన్ని చూసి అతని పై పగ పెంచుకుంటుంది. బేబీ పెరిగే కొద్దీ అతని మీద తన పగ కూడా పెంచుకుంటుంది.
పుట్టు మూగ, చెవుడు ఉన్న బేబీ పాపా అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకుని ఓ హిట్ ఉమెన్‌గా తయారవుతుంది. పాపా చెప్పిన వ్యక్తులను ప్రత్యేకంగా తయారు చేసిన గొడుగు తుపాకీ సాయంతో చంపేస్తూ ఉంటుంది. పైకి ఓ సాదా సీదా అమ్మాయిలా కనిపించే బేబీ లోపల కరడుగట్టిన హంతకురాలిలా తయారవుతుంది. మరి... ఈ జర్నీలో బేబీకి ఆ ముసుగు వ్యక్తి దొరుకుతాడా? లేదా అన్నది మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘బేబీ డూ డై డూ’లోనే చూడాలి. ఇదో మంచి థ్రిల్లర్. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ఊహకందనివి. ఓ మంచి టైమ్‌పాస్ సినిమా.
– హరికృష్ణ ఇంటూరు


