
హన్సిక నటించిన గార్డియన్ సినిమా ఏడాది తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే మేకర్స్ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్‌చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ఈమూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలక పాత్రలలో నటించారు.

ఔట్‌డేటెడ్ హారర్ మూవీగా ప్రేక్షకులు ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అయితే, గతేడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా 'ఆహా' తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత హన్సికకు మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో చివరగా 105 మినట్స్ అనే మూవీలో ఆమె నటించింది. ప్రస్తుతం నషా పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.
అసలు కథేంటంటే..
రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ.