
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్ వెబ్ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.
9/11... అమెరికా చరిత్రలో ఇదో మరచిపోని సంఖ్య. నాటికి, నేటికి, రేపటి తరానికి గుర్తుండిపోయే దారుణ ఘటన ఈ 9/11. న్యూయార్క్ నగరంలోని రెండు పెద్ద ఆకాశ హార్మ్యాలను విమానాలతో నేలమట్టం చేసి దాదాపు 3000కి పైగాప్రాణాలను బలిగొన్న ఈ ఘటన అతి కిరాతక చర్యగా అమెరికా చరిత్రలో నిలిచిపోయింది. అత్యంత హేయమైన ఈ తీవ్రవాద దాడి 9/11కి సూత్రధారి బిన్ లాడెన్. అంతటి కరుడు గట్టిన తీవ్రవాదిని ఉత్కంఠభరితంగా మట్టుబెట్టాయి నిఘా సంస్థలు. ఇదే ఇతివృత్తంగా నాటి ఘటనలను సిరీస్ రూపంలో నేడు నెట్ ఫ్లిక్స్ మన ముందుకు తీసుకొచ్చింది.
‘అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్’ పేరుతో ఈ సిరీస్ మూడు భాగాలతో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు భాషతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషలలో ఈ సిరీస్‌ని విడుదల చేశారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ... సిరీస్ మొత్తం అప్పుడు జరిగిన కొన్ని వాస్తవ సన్నివేశాలతో రూపకల్పన చేయడం. అంతేకాదు... అమెరికాలో ఈ ఆపరేషన్ గురించి అధికారులు ఎప్పటికప్పుడు అప్పటి ప్రెసిడెంట్‌కి బ్రీఫ్ చేయడం, అలాగే అప్పటి ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కొందరు అధికారుల వీడియో బైట్స్‌ను కూడా చాలా చక్కగా ఎడిట్ చేసి, చూపించారు.
నిజానికి ఈ సిరీస్ చూడడం మొదలు పెట్టిన కొద్ది సమయానికే మనం కూడా ఈ ఆపరేషన్‌లో వర్చ్యువల్‌గా ఇన్వాల్వ్ అయిపోతాం. మనకు 9/11 ఘటన గురించి తెలిసింది పిడికిడెంత అయితే ఈ సిరీస్ ద్వారా కొండంత విషయాలు తెలుస్తాయి. ‘అమెరికన్ మేన్ హంట్: ఒసామా బిన్ లాడెన్’... వర్త్‌ఫుల్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు