టైటిల్: 418
నటీనటులు: చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
సమర్పణ : ప్రశాంత్ నీల్
దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ
సంగీతం: వెంకీ జీజీ
సినిమాటోగ్రఫీ: దినేష్ దివాకర్
విడుదల తేది: అక్టోబర్ 23, 2026
కథేంటంటే..
వివేక్(సూర్య రాజ్)ని డాక్టర్‌గా చూడాలని అతని తల్లిదండ్రుల కల. ఆస్తులు అమ్మి కొడుకుని మెడికల్ కాలేజీలో చేర్పిస్తారు. ఆ కాలేజీ హాస్టల్ 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుస్తారు. అయితే అందులో 418 నంబర్ గదిని మాత్రం మూసే ఉంచుతారు. అంతేకాదు ఆ హాస్టల్‌లోకి అమ్మాయిలను అడుగుపెట్టనివ్వరు. అలాంటి హాస్టల్‌లోని 417 గదిలోకి వివేక్ చేరతాడు. అప్పటికే ఆ గదిలో మరో స్టూడెంట్ రోహిత్(చరణ్ లక్కరాజు) ఉంటాడు. ఓ రోజు స్నేహితులంతా కలిసి 418 గదిని తెరవాలని ప్లాన్ వేస్తారు. వివేక్ మాత్రం గదిలోనే ఉంటాడు. మిగిలివారంతా 418 గదిని తెరవడానికి వెళ్తారు. కానీ చివరి నిమిషంలో తమ ప్లాన్‌ని విరమించుకొని బయటకు వెళ్తారు. అదే రోజు రాత్రి వివేక్‌పై హత్యాయత్నం జరుగుతుంది. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. దీనంతటికి 418 నంబర్ గదినే కారణం అవుతుంది. అసలు ఆ గదిని ఎందుకు మూసేశారు? అందులో ఉన్నదెవరు? హాస్టల్‌లోకి అమ్మాయిలను ఎందుకు రానివ్వడం లేదు? 15 ఏళ్ల క్రితం ఆ మెడికల్ హాస్టల్‌లో జరిగిన ఘోరం ఏంటి? లండన్ నుంచి వచ్చిన సాయేషా (ప్రీతి పగడాల) ఆ గదిలోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నించింది? హాస్టల్‌లోకి ఆమె వెళ్లిన తర్వాత ఏం జరిగింది? దేవిక(చైత్ర ఆచార్) ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
హారర్ సినిమా అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. ఒక పాత బంగ్లా, అందులో ఒక ఆత్మ, దానికో ప్లాష్ బ్యాక్, అది హీరో లేదా హీరోయిన్‌ని వేధించడం.. చివరకు దాని నుంచి బయటపడటం.. దాదాపు ఇదే పాయింట్‌తో చాలా వరకు తీస్తుంటారు. ‘418’కథ కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. కానీ చూస్తున్న ప్రేక్షకుడిని ఎంతవరకు భయపెట్టామా అనేది కీలకం. ఈ విషయంలో '418' టీమ్ కొంతవరకు మాత్రమే సఫలం అయింది. కొన్ని చోట్ల నేపథ్య సంగీతంతో భయపెట్టినప్పటికీ.. కథనం చాలా వరకు బోరింగ్ సాగుతుంది. అసలు దర్శకుడు చెప్పాలనుకున్న విషయంలోనూ క్లారిటీ మిస్ అయిందనిపిస్తుంది.
(చదవండి: ‘నా వైఫ్ మిస్సింగ్’ రివ్యూ: వరుణ్, శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ మెప్పించారా?)
కథ ప్రారంభం బాగుంటుంది. హారర్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఇందులో ఉంటాయి. అయితే వాటిని ఆసక్తికరంగా మల్చడంలోనే దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. ప్రధాన పాత్రలంతా హాస్టల్‌లో కలుసుకోవడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది.ఆ తర్వాత కథే ముందుకు సాగదు. ఒకటి రెండు భయపెట్టే సీన్లు తప్ప ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు. ఇక ద్వితియార్థం ఉన్నంతలో కొంతవరకు ఆసక్తికరంగా సాగుతుంది. దేవిక నేపథ్యాన్ని సైకలాజికల్ కోణంలో చూపించడం, ఆ నేపథ్యంలో వచ్చే సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. చివరి పావుగంట కాస్త భయం కలిగించేలా ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా హారర్ సినిమాలు చూసేవాళ్లను ఈ సినిమా భయపెట్టకపోవచ్చు.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం కన్నడ నటి చైత్ర ఆచార్. దేవిక పాత్రలో ఆమె నటన చాలా బాగుంది. కొన్ని చోట్ల భయపెట్టిస్తే..మరికొన్ని చోట్ల ఎమోషనల్‌కు గురి చేస్తుంది. మిగిలిన నటీనటులంతా కొత్త వాళ్లే. అయినప్పటికీ తమ తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. వెంకీ జీజీ నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.


