టైటిల్: నా వైఫ్ మిస్సింగ్
నటీనటులు: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, ప్రవీణ్, సత్యశ్రీ, మోహిత్.. తదితరులు
నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
నిర్మాత: శివ కంఠంనేని
దర్శకత్వం: స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్. సతీష్ కుమార్
ఎడిటర్: సాయిబాబు తలారి
స్ట్రీమింగ్ వేదిక: ఆహా
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ ప్రేక్షకులను ఎంత ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి ‘నా వైఫ్ మిస్సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నేటి(అక్టోబర్ 23) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇన్నేళ్ల తర్వాత ఈ జంట చేసిన మ్యాజిక్ ఎలా ఉంది? సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
బాలు(వరుణ్ సందేశ్) ఓ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటాడు. తన భార్య స్వప్న(శ్వేతా బసు ప్రసాద్) మిస్ అయిందని బాలు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. దాంతో తన గతం చూపిస్తారు. పెద్దలు చూసిన సంబంధం స్వప్న(శ్వేతా బసు ప్రసాద్) తను వర్జిన్ కాదని పెళ్లి చూపుల్లో చెప్పినా బాలు ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత స్వప్న, అబాన్(మోహిత్ పెద్దాడ) అనే వ్యక్తిని ప్రేమించాను, అతనితో వెళ్ళిపోతాను అని చెబుతుంది. అందుకు కూడా బాలు సైలెంట్ గా ఒప్పుకొని ఒక ప్లాన్ వేస్తారు. సడెన్ గా స్వప్న మిస్ అవ్వడంతో బాలుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అబాన్ కూడా స్వప్న నా దగ్గరకు రాలేదు అని బాలుకి బెయిల్ ఇప్పిస్తాడు. మరి స్వప్న ఎక్కడికి వెళ్ళింది? స్వప్న బాలుతో ఉంటుందా? అబాన్ తో వెళ్లిపోతుందా? స్వప్న ఏం చేసినా బాలు ఎందుకు సైలెంట్ గా ఉంటాడు? ఇవన్నీ తెలియాలంటే ఆహా ఓటీటీలో నా వైఫ్ మిస్సింగ్ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
కొత్తబంగారు లోకం సినిమాతో 18 ఏళ్ళ క్రితం బిగ్గెస్ట్ హిట్ కొట్టి క్యూట్ పెయిర్ గా నిలిచిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ఇన్నేళ్ల తర్వాత కలిసి చేస్తుండటం, దాదాపు పదేళ్ల తర్వాత శ్వేతా బసు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం, థ్రిల్లర్ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఒక అమ్మాయి మిస్ అవుతుంది, ఆమెని ఎలా కనిపెడతారు అనే రొటీన్ కథే అయినా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు లింక్ పెట్టి తెరకెక్కించారు.
ప్రస్తుతం, గతానికి మధ్య కథ కొనసాగే స్క్రీన్ ప్లేతో నడిపించారు. బాలు నా భార్య మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ బాలు - స్వప్న పెళ్లి, అబాన్ గురించి, స్వప్న పేరెంట్స్ తో నడుస్తుంది. ఇంటర్వెల్ కి స్వప్న బాలు దగ్గర లేక అబాన్ దగ్గర లేక ఎక్కడికి వెళ్ళింది అనే బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా స్వప్న ఏమైంది అని సాగుతుంది.
సినిమా చాలా స్లో నేరేషన్ లో సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఫార్వార్డ్ చేసుకుంటూ చూస్తాము. అంత నిదానంగా కథ సాగుతుంది. ఈ విషయంలో మాత్రం మలయాళం సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం సమాజంలో కొంతమంది మహిళలు పెళ్లి అయినా తమ పాత ప్రేమలు కొనసాగించడం, దాని వల్ల దారుణ పరిణామాలు జరుగుతున్నాయి. ఆ టాపిక్ ని ఈ సినిమాలో బాగా కవర్ చేశారు. క్లైమాక్స్ లో స్వప్న ఏమైంది అనే ట్విస్ట్ ఊహించలేము కానీ ఎవరు చేస్తారు అనేది మాత్రం ఊహించొచ్చు. లవ్ ట్రాక్ చుట్టూ తిరిగిన కథ ఒక్కసారిగా మరో వైపుకు టర్న్ తీసుకోవడం బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళు ఆహా ఓటీటీలో ఒకసారి ఈ నా వైఫ్ మిస్సింగ్ సినిమా చూసేయొచ్చు.

ఎవరెలా చేశారంటే..
వరుణ్ సందేశ్ బాగానే నటించాడు, ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కూడా మెప్పించాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగులో నటించిన శ్వేతా బసు ప్రసాద్ సింపుల్ గా బాగానే నటించింది. పోలీస్ పాత్రలో జబర్దస్త్ సత్యశ్రీ బాగా మెప్పించింది. నటుడు ప్రవీణ్ పోలీస్ పాత్రలో బాగా నటించాడు. మోహిత్ పెద్దాడ బాయ్ ఫ్రెండ్ పాత్రలో పర్వాలేదు అనిపించాడు. మిగిలిన నటీనటుల వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొన్ని లొకేషన్స్ కూడా బాగా చూపించారు. సాయి కార్తీక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది. కానీ కొన్ని ట్యూన్స్ గతంలో ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఆదిత్య భార్గవ్ రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. దర్శకురాలు స్వాతిప్రకాష్ రొటీన్ కథే అయినా సాంకేతికంగా బాగానే తెరకెక్కించింది. నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు.


