● నేటి నుంచి జంగుబాయి ఉత్సవాలు.. ● తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పుణ్యక్షేత్రం ● ఆరు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీల ఆగమనం ● నేనెలరోజుల పాటు పూజలు జాతర ● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ నిర్వాహకులు | Sakshi
Sakshi News home page

● నేటి నుంచి జంగుబాయి ఉత్సవాలు.. ● తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పుణ్యక్షేత్రం ● ఆరు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీల ఆగమనం ● నేనెలరోజుల పాటు పూజలు జాతర ● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ నిర్వాహకులు

Published Sun, Jan 14 2024 1:12 AM

-

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఎత్తైన గుట్టలు.. చుట్టూరా అడవులు.. అభయారణ్యం.. ఏపుగా పెరిగిన చెట్లు.. నడిచేందుకు కూడా భయపడే అభయారణ్యంలో జంగుబాయి వనక్షేత్రం..! లక్షలాది మంది ఆదివాసీలు పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ సంవత్సరం పుష్యం మాసం నుంచి ప్రారంభమై నెల రోజులు పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదాస్పద ప్రాంతమైన కెరమెరి మండలంలోని ముకదంగూడ గ్రామ పంచాయతీకి చెందిన మహరాజ్‌గూడ గ్రామ అడవుల్లో జంగుబాయి దేవత కొలువై ఉంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ బస చేసిందని పురాణాలు చెబుతున్నాయి.

గుహలో బస..

ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి దేవత గుహలో బస చేసింది. పోచమ్మ ఆలయం వెనుక భాగంలోంచి పై భాగంలో జంగుబాయి దేవి ఉంది. అది పూర్తిగా గుహ కావడం వల్ల భక్తులు కూర్చునే నడుస్తారు. చిమ్మని చీకటిలో దీపం వెలుగులో ఆ దేవత కనిపిస్తుంది. పుష్యమాసంలో కనిపించే నెలవంక నుంచి జంగుబాయి జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది.

ఎనిమిది గోత్రాల కుటుంబాలు ఒకే వేదికపై...

వివిధ రాష్ట్రాల్లోని జంగుబాయి వారసులైన వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హెర్రకుంరం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. వారు కేవలం కాలిబాట, ఎడ్ల బండ్లపై వందలాది కిలో మీటర్లు రవాణా సాగిస్తారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పుజారులుగా వ్యవహరిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తారు. ఏడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుతో కొంత అభివృద్ధికి నోచుకుంది.

ఆరు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు రాక

నేడు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఆదివాసీలు రానున్నారు. తారురోడ్డు సౌకర్యం లేకున్నా రాళ్లు రప్పలు, దుమ్ము, ధూళిలో సైతం కొందరు కాలిబాటతో వస్తే మరికొందరు ఎడ్ల బండ్లపై వస్తుంటారు. ఎడ్లబండ్లకు పార్కింగ్‌ స్థలం, భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు.

ఇలా చేరవచ్చు!

జంగుబాయి పుణ్యక్షేత్రానికి కెరమెరి మండలం నుంచి ఆనార్‌పల్లి మీదుగా ఉమ్రి వంతెన నుంచి పరందోళి మీదుగా... లేదా పరంధోళి సమీపం నుంచి ముకదంగూడ గ్రామానికి ఆనుకుని ఉన్న కచ్చా రోడ్డుతో వెళ్లవచ్చు. లేదా నార్నూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి కొత్తపల్లి మీదుగా.. ఆదిలాబాద్‌ నుంచి లొకారి మీదుగా జంగుబాయి దేవి వద్దకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.

Advertisement
Advertisement