బీఆర్‌ఎస్‌ పాలనలోనే సామాజిక న్యాయం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలనలోనే సామాజిక న్యాయం

Published Wed, Nov 22 2023 1:38 AM

మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌   - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సామాజిక న్యాయం జరిగిందని, 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పేద వర్గాలు అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌తో కలిసి మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసిఆర్‌ హాజరవుతారని, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. విద్య, వైద్యంతోపాటు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు, ఐటీ పార్కులు పాలమూరులో స్థాపించేందుకు సీఎం కేసిఆర్‌ కాళ్లు మొక్కుతానని చెప్పారు. మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్‌లో అంతర్భాగంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని, విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. గాంధీ తరహాలో వెయ్యి పడకలతో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానా పనులు కేవలం 5 నెలల్లో 50 శాతం పూర్తయ్యాయన్నారు. పేదవాడికి అన్ని రకాల వైద్య సౌకర్యాలు మహబూబ్‌నగర్‌లోనే అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. అమర్‌రాజా కంపెనీతో పదివేల ఉద్యోగాలు లభిస్తాయని, లక్ష ఉద్యోగాల కల్పనే ధ్యేయం అన్నారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని, పొరపాటున కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే తిరిగి 50 ఏళ్లు వెనక్కి పోతామని చెప్పారు. వెయ్యి పడకల దవాఖానా ఆగిపోతుందని, తీగల వంతెనను ఇనుప సామాన్లకు అమ్ముకుంటారని, శిల్పారామం గేట్లు కూడా అమ్మేస్తారని, మంచినీటి ఇబ్బందులు తప్పవని దుయ్యబట్టారు. నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాయమాటలు నమ్మొద్దని హితవు పలికారు. సమావేశంలో నాయకులు సయ్యద్‌ ఇబ్రహిం, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, ముడా చైర్మన్‌ వెంకన్న, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెహమాన్‌, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్నయాదవ్‌, బీఆర్‌ఎస్‌ కెవి జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్‌, వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యుడు అన్వర్‌పాష తదితరులు పాల్గొన్నారు.

విద్య, వైద్యం, ఉపాధి కోసం సీఎం కాళ్లు మొక్కుతా

హైదరాబాద్‌లో అంతర్భాగంగాపాలమూరును తీర్చిదిద్దుతా

కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే..

50 ఏళ్లు వెనక్కి వెళ్తాం

మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
Advertisement