గింజల దోపిడీ ఆగేదెన్నడు? | Sakshi
Sakshi News home page

గింజల దోపిడీ ఆగేదెన్నడు?

Published Tue, May 21 2024 8:30 AM

గింజల దోపిడీ ఆగేదెన్నడు?

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పనిచేసే కూలీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కూలీలు చెప్పిందే వేదం అన్నట్లుగా, వారు అడిగిన కాడికి గింజలు ఇస్తేనే రైతులను ఏమి అనకుండా వదిలేస్తున్నారు..లేదంటే తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు ప్రతీరోజు జరుగుతున్నప్పటికీ ఏఎంసీ పాలకవర్గం, మార్కెట్‌ అధికారులు పట్టించుకోవటంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కూలీలకు, హమాలీలకు దానధర్మాల పేరిట ఎలాంటి గింజలు పెట్టకూడదని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో రాసిన బోర్డులు నిరుపయోగంగా మారాయి. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు కురవి, బయ్యారం, మరిపెడ, సీరోలు, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, ఇతర మండలాల నుంచి రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువస్తుంటారు. ఈ క్రమంలో వారు పత్తి, ధాన్యం, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, కందులు, బొబ్బెర్లు, వేరుశనగ, పచ్చజొన్న పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకురాగా బస్తాలు నింపటం, కాంటా పెట్టే క్రమంలో మోసాలు జరుగుతున్నాయి. కూలీలు బస్తాలు నింపే సమయంలో రైతుల వద్ద నుంచి దానధర్మాల పేరిట గింజలను అడుగుతున్నారు. రైతులు ఇచ్చిన వరకు సరిపెట్టుకోకుండా అదనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పైగా ఒకానొక సందర్భంలో రైతుల కళ్లు గప్పి గింజలను చోరీ చేస్తూ బస్తాల్లో నింపుకుంటున్నారు. ఇదేమి దోపిడని రైతులు అడిగితే వారిని దబాయిస్తున్నారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో కూలీల గింజల దోపిడీ ఆగడాలకు చెక్‌ పెట్టకుంటే రైతులు మార్కెట్‌కు రావటం బంద్‌ చేస్తారని పేర్కొన్నారు.

రైతులను ఇబ్బంది పెడుతున్న కొందరు కూలీలు

వ్యవసాయ మార్కెట్‌కు రావాలంటే

భయపడుతున్న రైతులు

నిరుపయోగంగా ప్రచార బోర్డులు

Advertisement
 
Advertisement
 
Advertisement