● బీమా సంస్థకు వినియోగదారుల కమిషన్‌ ఆదేశం | Sakshi
Sakshi News home page

● బీమా సంస్థకు వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

Published Tue, Apr 23 2024 8:15 AM

-

రైతులకు వడ్డీతో రూ.3 కోట్లు చెల్లించాల్సిందే

కర్నూలు (లీగల్‌): గోడౌన్‌లో దాచుకున్న పంట షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోయిన ఘటనలో 25 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తేల్చిచెప్పింది. గోడౌన్‌ యజమాని కావాలనే రైతులు దాచుకున్న పంటను కాల్చివేశారన్న అనుమానంతో పరిహారం తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. గోడౌన్‌ యజమానే కాల్చివేశారనడానికి ఎటువంటి ఆధారాలను ఇన్సూరెన్స్‌ కంపెనీ సమర్పించలేదని స్పష్టం చేసింది. 25 మంది రైతులకు రూ.3 కోట్లు పరిహారం 2018 నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్‌ అధ్యక్షులు కె.కిషోర్‌కుమార్‌, సభ్యులు ఎన్‌.నారాయణరెడ్డి, నజీమా కౌసర్‌లతో కూడిన బెంచ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలోని శ్రీసాయి లక్ష్మి రూరల్‌ గోడౌన్‌లో సమీప గ్రామాలకు చెందిన 25 మంది కందిపప్పు, జొన్న, మినుములు, శనగపప్పు పంటను జులై 2017లో ఏడాది పాటు నిల్వ చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2018 జులై 4న గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు 80 శాతం పంట కాలిపోయింది. ఈ గోడౌన్‌కు యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన రూ.18 కోట్ల విలువైన నాలుగు బీమా పాలసీలు ఉన్నాయి. పరిహారం చెల్లించాలంటూ గోడౌన్‌ యజమాని, రైతులు బీమా కంపెనీని ఆశ్రయించినా ఫలితం లేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసులు దాఖలు చేయడంతో పై విధంగా ఆదేశాలు ఇచ్చింది.

Advertisement
Advertisement