కేసీ కెనాల్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు | Sakshi
Sakshi News home page

కేసీ కెనాల్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

Published Sat, Nov 18 2023 1:54 AM

మాల సాయిచరణ్‌          పవన్‌కుమార్‌  - Sakshi

కర్నూలు: నగరంలోని బుధవారపేటకు చెందిన మాల సాయిచరణ్‌(14), రాపోగు పవన్‌కుమార్‌(14) వినాయక ఘాట్‌ వద్ద కేసీ కెనాల్‌లో మునిగి గల్లంతయ్యారు. తిమ్మప్ప, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. పెద్ద కుమారుడు సాయిచరణ్‌ కర్నూలు కలెక్టరేట్‌ వెనుకనున్న ఇందిరాగాంధీ మెమోరియల్‌ నగరపాలక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తండ్రి తిమ్మప్ప స్కందాన్షి కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగి. అదే కాలనీ (ఉపాసంపల్లె)కి చెందిన సూరిబాబు, దానమ్మల కుమారుడు పవన్‌కుమార్‌ అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. తండ్రి చనిపోగా తల్లి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తోంది. విద్యార్థులిద్దరూ ఒకే కాలనీకి చెందినవారు కావడంతో శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లి పుస్తకాల బ్యాగులు తరగతి గదిలో పెట్టి అదే కాలనీకి చెందిన మరో ఇద్దరితో కలసి సరదాగా ఈత కొట్టేందుకు వినాయక ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులిద్దరూ కెనాల్‌లోకి దిగగా వారితో పాటు వచ్చిన మరో ఇద్దరు ఒడ్డునే నిలబడుకున్నారు. కెనాల్‌లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిచరణ్‌, పవన్‌ కుమార్‌ నీటిలో మునిగి కొట్టుకుపోయారు. వారితో పాటు వెళ్లిన మరో ఇద్దరు నీటిలోకి దిగడానికి భయపడి తిరిగి ఇంటికి వచ్చి జరిగిన ఘటనను విద్యార్థుల తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు మూడవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. సీఐ మురళీధర్‌ రెడ్డితో పాటు ఎస్‌ఐ రవూఫ్‌, బ్లూ కోల్ట్స్‌, క్యూ ఆర్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వినాయక ఘాట్‌ వద్ద నుంచి జొహరాపురం మీదుగా కేసీ కెనాల్‌ వెంట పడిదెంపాడు వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు బంధువులతో కలసి సాయంత్రం వరకు కెనాల్‌ వెంట గస్తీ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది.

1/1

Advertisement
Advertisement