రత్నగిరికి నేటి నుంచి భక్తజన తాకిడి | Sakshi
Sakshi News home page

రత్నగిరికి నేటి నుంచి భక్తజన తాకిడి

Published Tue, Nov 21 2023 11:32 PM

పశ్చిమ రాజగోపురం వద్ద భక్తుల సందడి - Sakshi

అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి బుధవారం నుంచి ఆరు రోజుల పాటు భక్తులు పోటెత్తనున్నారు. సోమవారం వరకు వరుసగా పర్వదినాలు రావడమే దీనికి కారణం. బుధవారం కార్తిక శుద్ద దశమి, గురువారం ఏకాదశి, శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి, శనివారం, ఆదివారం పర్వదినాలు, సోమవారం కార్తిక పౌర్ణమి సత్యదేవుని గిరిప్రదక్షణ కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి రానున్నారు. దీంతో ఆ మేరకు దేవస్ధానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

తెల్లవారుజామునుంచి వ్రతాలు

భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని సత్యదేవుని దర్శనం, వ్రతాల నిర్వహణ తెల్లవారుజాము నుంచి ప్రారంభించనున్నారు. స్వామివారి వ్రతాల టిక్కెట్లు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి విక్రయిస్తారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి వ్రతాలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. స్వామివారి నిత్య కల్యాణమండపం, పాత కల్యాణ మండపంలో కూడా వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకం వద్ద రోజూ పది వేల మందికి ఉచితంగా పులిహోర, దద్దోజనం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రసాదం, వ్రతాల టిక్కెట్లు కౌంటర్లు

పశ్చిమ రాజగోపురం ఎదురుగా, విశ్రాంతి షెడ్డు ముందు భాగంలోకి ప్రసాదం, వ్రతాల టిక్కెట్లు విక్రయించే కౌంటర్లు మార్చారు. గతంలో ఇవి విశ్రాంతి షెడ్డు చివరలో ఏర్పాటు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఈఓ కే రామచంద్రమోహన్‌ వీటిని ముందు భాగంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, మంగళవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోప్రదక్షణ నిర్వహించి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ కే రామచంద్రమోహన్‌ దేవస్థానంలో ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు.

తెప్పోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు

శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్బంగా పంపా నదిలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం సిబ్బంది తెప్పను హంస వాహనంగా అలంకరిస్తున్నారు. పంపా నదిలో ఇరిగేషన్‌ సిబ్బంది ట్రైల్‌ రన్‌ నిర్వహించగా ఎటువంటి సమస్యలు తలెత్తలేదని ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ కే శ్రీదేవి తెలిపారు. ప్రస్తుతం పంపా నదిలో నీటిమట్టం 92 అడుగులు ఉందన్నారు. ఆయకట్టుకు నీటి విడుదల నిలుపుదల చేశామని 24వ తేదీకి పంపా నీటిమట్టం మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించారు.

వరుసగా ఆరు రోజులపాటు

పర్వదినాలు

30 వేలకు పైగా

వ్రతాలు జరిగే అవకాశం

తెప్పోత్సవానికి చురుకుగా సన్నాహాలు

ప్రసాదం, వ్రతాల కౌంటర్లు విశ్రాంతి 
షెడ్డు ముందు భాగంలో ఏర్పాట్లు
1/2

ప్రసాదం, వ్రతాల కౌంటర్లు విశ్రాంతి షెడ్డు ముందు భాగంలో ఏర్పాట్లు

సత్యదేవుని తెప్పోత్సవానికి 
సిద్దమవుతున్న హంస వాహనం
2/2

సత్యదేవుని తెప్పోత్సవానికి సిద్దమవుతున్న హంస వాహనం

Advertisement
Advertisement